12 August, 2026 | 2:45 AM

రాష్ట్ర రాబడి అధికారుల బాధ్యత

12-08-2026 12:00 AM

అధికారులు ఎంతటి నిజాయితీపరులైనా, సమర్థులైనా పర్యవేక్షణ సరిగా లేకపోతే వారు ప్రలోభాలకు గురై అవినీతిని ఆశ్రయించే అవకాశం ఉన్నది. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయవచ్చు. అలాంటి అక్రమాలను నియంత్రించేందుకే గూఢచారి వ్యవస్థను పటిష్ఠంగా నెలకొల్పాలనే చాణక్యుని సూచన సార్వకాలికం అనవచ్చు. 

త్రిశతం చతుఃపంచాశచ్చ 

అహోరాత్రాణాం కర్మవత్సరః

తమాషాఢీపర్యవసానమ్ 

ఊనం, పూర్ణం వా దద్యాత్, 

కరణాధిష్ఠితమ్ అధిక మాసకం 

కుర్యాత్! 

(కౌటిలీయం 2

ఉద్యోగులకు జీతభత్యాలను చెల్లించే విధానం వివరిస్తున్నాడు, ఆచార్య చాణక్య. కర్మవత్సరం అనగా పనిచేసే సంవత్సరాన్ని మూడు వందల యాభైనాలుగు రోజులుగా గణించాలి. సంవత్సర ఆరంభం ఆషాఢ పౌర్ణిమ నుంచి గణించాలి. గణికుని చేత నెలనెలకూ వేరువేరుగా లెక్కలు వేయించి, కర్మవత్సరాన్ని బట్టి అది తగ్గినా పెరిగినా (అధిక మాసాల కారణంగా) జీతభత్యాలను చెల్లించాలి, అంటున్నాడు చాణక్య. దీని వల్ల ఉద్యోగులు న్యాయమైన వేతనాలను పొందడం, స్పష్టమైన లెక్కలు చేయడం, కాలగణనలో తలెత్తే తేడాల వల్ల ఉద్యోగులు నష్టపోకుండా చూడడం, అధికారుల జోక్యాన్ని నియంత్రించడం, అనే సాధారణమైన పరిపాలనా సూత్రాలు పాటింపబడతాయి.

నిజానికి దీనిని జీతాల చెల్లింపు విధానంగా మాత్రమే చూడకుండా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో ప్రమాణీకరణ, లెక్కల క్రమబద్ధత, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ అనే ఆధునిక భావనలకు కూడా దగ్గరగా ఉంటుందని భావించవచ్చు. జనపదాలలో జరుగుతున్న విషయాలను, అక్కడి జనుల ఆచారవ్యవహారాలను, అలవాట్లను, ఆయా ప్రాంతాలలో స్థిరంగా పాటించే నియమనిబంధలను పాలకుడు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అలా తెలుసుకొనని నాయకుని అజ్ఞానం రాష్ట్ర రాబడికి నష్టం కలిగిస్తుందంటాడు చాణక్య.

జీతభత్యాల లెక్కలను చూసే అధికారులను గూఢచారుల ద్వారా పర్యవేక్షించాల ని సూచించడం చాణక్యుని వాస్తవిక రాజకీయ పరిణతిని తెలియజేస్తుంది. ఆయా బాధ్యతలలో సమర్థులైన అధికారులను నియమించడంతో నాయకుని బాధ్యత తీరిపోదు. వారు నిజాయితీగా పనిచేస్తున్న విధానాన్నీ నిరంతరం పరిశీలించినప్పుడే ఆశించిన ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. అధికారులు ఎంతటి నిజాయితీపరులైనా, సమర్థులైనా పర్యవేక్షణ సరిగా లేకపోతే వారు ప్రలోభాలకు గురై అవినీతిని ఆశ్రయించే అవకాశం ఉన్నది.

ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయవచ్చు. అలాంటి అక్రమాలను నియంత్రించేందుకే గూఢచారి వ్యవస్థను పటిష్ఠంగా నెలకొల్పాలనే చాణక్యుని సూచన సార్వకాలికం అనవచ్చు. ఈనాటి ప్రజాస్వామ్య పాలనలో కూడా ఆడిట్ విభాగాలు, విజిలెన్స్ సంస్థలు, సామాజిక తనిఖీలు, సమాచార హక్కు లాంటి వ్యవస్థల ద్వారా అధికారుల పనితీరుపై పారదర్శకమైన, చట్టబద్ధమైన నిరంతర పర్యవేక్షణా విధానం కనిపిస్తుంది. 

రాష్ట్ర రాబడికి నష్టం కలిగించే అధికారుల లేదా పాలకుల అజ్ఞానం ఎన్ని విధాలుగా వ్యక్తమవుతుందో తెలియజేస్తున్నాడు చాణక్య. ఇక్కడ ‘అజ్ఞానం’ అనేది కేవలం చదువు లేకపోవడం కాదు. వివేకరహితమైన విధి నిర్వహణ, స్వార్థపరత్వం, భావోద్వేగాల బలహీనతలు, ఆవేశకావేశాలు, అనైతిక వర్తన లాంటి అనేక లోపాల సమాహారమే అజ్ఞానంగా భావించాలి. సోమరితనం వల్ల పనులు వాయిదా పడతాయి, నిర్ణయాలు ఆలస్యమవుతాయి. దానివల్ల సకాలంలో ప్రజలకు సేవలు అందవు.

పనిచేయడంలోని శ్రమను సహించకపోవడం వల్ల సోమరితనం కలుగుతుంది. అలాగే సంగీత సాహిత్యాల పట్ల అమితమైన ఆసక్తి కారణంగా కలిగే ఇంద్రియ సుఖాలకు అలవాటుపడడం వల్ల పొరపాట్లు చేస్తారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి తప్పుకాదు. ఆసక్తి వ్యసనంగా మారి అధికార బాధ్యతలను మరచిపోయేందుకు కారణమైతే మాత్రం దానిని అనైతికతగానే భావించాలి. ‘పని సమయంలో వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం’ లేదా విధి నిర్లక్ష్యం వైఫల్యంగా పరిగణించాలి. 

చేసే పని అధర్మమనో, ఎవరైనా తిడతారనో, అనర్థాలు కలుగుతాయనో  భయపడడం కారణంగా పనులు చెడవచ్చు. నిర్ణయాలను నిరంతరం వాయిదా వేయవచ్చు. తన వైఫల్యాలను ఇతరులపై నెట్టవచ్చు. సమస్యలను పరిష్కరించకుండా దాచిపెట్టవచ్చు. అయితే కర్తవ్య నిర్వహణలో చట్టబద్ధమైన జాగ్రత్త అవసరమే కానీ భయంతో నిర్ణయాలను వాయిదా వేయడం అధికారి అసమర్థతకు ప్రతీకయే. వ్యక్తిగత పనిమీద వచ్చిన వారికి సహాయపడాలనే తపనతో కర్తవ్యాన్ని విస్మరించడం లేదా ఉద్యోగ ధర్మానికి భిన్నంగా అధికారాన్ని

ఉపయోగించడం కామంచేత జరుగుతుంది. కామా న్ని వ్యక్తిగత అభిమానంగా చెప్పుకొంటే చట్ట పరిధిలో తనను ఆశ్రయించినవారికి సహాయం చేయాలనే భావనతో అధికార దుర్వినియోగం చేయడాన్ని ‘కామం’గా పేర్కొంటారు. దీనిని విస్తృత పరిధిలో వ్యక్తిగత మమకారం, పక్షపాతం, బంధుప్రీతిగా అర్థం చేసుకుంటే దానివల్ల అర్హులకు అన్యాయం, అనర్హులకు మేలూ జరగవచ్చు. ప్రభుత్వ ధనమూ, అధికారుల వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయుక్తమై పరిపాలనపై ప్రజల నమ్మకం తగ్గుతుంది.

కొందరిలో హింసాప్రవృత్తి ఉంటుంది. హింసా ప్రవృత్తి వల్ల కోపం, కోపంతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారి నిష్పక్షపాత వైఖరికి దూరమవుతాడు. స్వల్ప తప్పిదాలకు విపరీతమైన శిక్షలు విధించవచ్చు, ప్రజలతో దురుసుగా ప్రవర్తించవచ్చు, తనకిష్టం కానివారిపై అధికారాన్ని ప్రతీకా ర సాధనంగా ఉపయోగించవచ్చు. ఇక్కడ చాణక్య అధికారికి అవసరమైన ఆత్మనిగ్రహాన్ని పరోక్షంగా ప్రతిపాదిస్తున్నాడు. బాధ్యత గలిగిన వ్యక్తి కోపం వ్యక్తిగత లోపం మాత్రమే కాదు, అది సంస్థాపరమైన లోపంగా పరిణమించి రాష్ట్రానికి ఆర్థి క నష్టాన్ని తెచ్చే అవకాశం ఉన్నది. ఎప్పుడైనా భయపెట్టే పాలన ఉత్పత్తి, ఉత్పాదకతలను, వ్యాపార వాణిజ్యాలను, పన్నుల చెల్లింపులనూ ప్రభావితం చేస్తుంది.

కొందరు విద్య వల్ల, మరికొందరు ధనమదం చేత, ఇంకాకొందరు పాలకులకు దగ్గరగా ఉండే వారిని ఆశ్రయించి తద్వారా పొందిన అధికార దర్పంచేత రాష్ట్ర రాబడికి నష్టం కలిగిస్తారు. విద్య, ధనమూ రెం డూ ప్రజాసేవకు, సామాజిక వికాసానికి, ఉపాధి కల్పనకు ఉపకరించాలి. అలాకాక, అవి అహంకారానికి ఉపకరణాలైతే.. ప్రజాజీవితం అల్లకల్లోలమవుతుంది. కొందరు తూకాలు, కొలతలు, తప్పుడు లెక్కలతో మోసం చేయడం ద్వారా లోభచిత్తులై రాష్ట్ర రాబడికి నష్టం కలిగిస్తారు. లోభానికి బందీయైన అధికారి వల్ల ప్రభుత్వానికి రాబడి తగ్గి వ్యాపారులు, ప్రజలు మోసపోతారు. విపణివీధిలో న్యాయం కనుమరుగవుతుంది. ప్రజా ధనం వ్యక్తిగత సంపదగా మారుతుంది. 

పాలకులు ప్రజల జీవన విధానం, వృత్తులు, సంప్రదాయాలు, ఆర్థిక స్థితిగతులు, స్థానిక సంస్కృతి, అవసరాలు, పరిస్థితులను అవగాహన చేసుకొని పాలన చేయాలి. ఒకే విధమైన నియమ నిబంధనలను అన్ని ప్రాంతాలపై యాంత్రికంగా అమలు చేయడం వల్ల అపోహలు, అసంతృప్తి పెరగవచ్చు. ప్రభుత్వ ఆదాయమూ తగ్గవచ్చు. స్థానిక సమస్యలకు సరైన పరిష్కారం సూచించకపోతే ప్రజల మధ్య అసహనం పెరిగిపోవచ్చు. 

ఏ కాలంలోనైనా పన్నుల రూపంలో సేకరించేది ప్రజా ధనమే. దానిని సక్రమం గా ప్రజా అవసరాలకు మాత్రమే వినియోగించే బాధ్యత పాలకులది.. దానిని పారదర్శకంగా నిర్వహించే బాధ్యత అధికారులది. అందువల్ల అధికారులు క్రమశిక్షణ, నిజాయితీ, నిష్పక్షపాతం, ఆత్మనిగ్రహంతో పనిచేయాలి. అలసత్వం, భయం, మమకారం, కోపం, అహంకారం, లోభం వంటి లక్షణాలు వ్యక్తిగత బలహీనతలుగా కనిపిస్తున్నా వాటి ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడుతుందని చాణక్యుని అభిప్రాయం గా చెప్పుకోవచ్చు. ఈ సూత్రాలను తన కాలానికే ప్రతిపాదించడం చాణక్యుని దూరదృష్టికి నిదర్శనంగా చెప్పుకోవాలి.