ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి
TGVP ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్
ఆదిలాబాద్, (విజయక్రాంతి) : అదిలాబాద్ జిల్లాలో ఫీజుల నియంత్రణ చట్టం(Fee Regulation Act) అమలు చేయాలని TGVP ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధ వారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు నూతన అడ్మిషన్ల ప్రక్రియలో టెక్నో, మెమొరియల్, కాన్సెప్ట్, స్టార్, ప్రైమ్ తదితర తోకలు పెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నాయని, విద్యా ప్రమాణాలు పాటించకుండా సంపాదనే లక్ష్యంగా విద్యా వ్యాపారానికి పాల్పడుతూ పేద వర్గాల వద్ద అధిక మొత్తంలో డొనేషన్ల పేరుతో ఫీజులను గుంజుతూ పేదల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆకాశాన్ని తాకే ఎత్తయిన భవనాలలో తరగతులు నిర్వహించడం, సురక్షిత మంచినీటి సౌకర్యం కల్పించకపోవడం, గ్రౌండ్ సౌకర్యం లేకపోవడం, ఫైర్ సేఫ్టీ లేకపోవడం, ఫ్రీ ప్రైమరీకి పర్మిషన్ తీసుకొని హై స్కూల్స్ నడిపిస్తున్న వైనం, తరగతి గదులలో కనీసం వెలుతురు, గాలి లేకుండా చీకటి గదులలో తరగతులను కొనసాగించడం, అర్హతలు లేని ఉపాధ్యాయులను తక్కువ జీతభత్యాలకు నియమించుకోవడం లాంటి అసౌకర్యాలను విద్యార్థులకు కల్పించి లక్షల రూపాయలు డిమాండ్ చేసినా విద్యాశాఖ అధికారులు నోరు మెదపకుండా ఉండటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మేల్కొని విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఉల్లెంగుల సతీష్ కుమార్, సాయి చరణ్, ఉబేద్, సాయి కిరణ్, షేక్ రయాన్, షేక్ అయాన్, షేక్ అద్నాన్ తదితరులు పాల్గొన్నారు.






