డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుల పనితీరుకు పరీక్ష జరగనుంది. గాంధీ భవన్‌లో ఏఐసీసీ (AICC) తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) నేటి నుంచి రెండు రోజుల పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ (District Congress Committee) అధ్యక్షులతో వన్ టూ వన్ సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. మీనాక్షి నటరాజన్‌తో కలిసి సమీక్షా సమావేశాల్లో పాల్గొనేందుకు AICC నాయకుడు సెంథిల్ కూడా హైదరాబాద్‌కు చేరుకున్నారు. సమావేశాల సందర్భంగా, మీనాక్షి నటరాజన్ ప్రతి DCC అధ్యక్షుని పనితీరును సమీక్షించనున్నారు.
తమతమ జిల్లాల్లో చేపట్టిన పనులు, సాధించిన పురోగతికి సంబంధించిన సమగ్ర నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని డీసీసీ అధ్యక్షులందరికీ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. నాయకుల పనితీరుకు సంబంధించిన అంచనాలను అందుకోలేకపోయిన DCC అధ్యక్షులను మార్చవచ్చని AICC ఇప్పటికే స్పష్టం చేసింది. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు సహకరించడం లేదని పలువురు DCC అధ్యక్షులు అగ్రనేతలకు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లన్నర సంవత్సరాల కాలం పూర్తయిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం అంతర్గత విభేదాలను పరిష్కరించడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతోంది. సమీక్షా సమావేశాల సందర్భంగా మీనాక్షి నటరాజన్ పార్టీ నాయకులతో తుంగతుర్తి కాంగ్రెస్ అంశంపై కూడా చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.






