ఫర్టిలైజర్ యాప్‌ను తొలగించాలి
ఏవో, డీటీకి భారతీయ కిసాన్ సంఘం వినతి
మొయినాబాద్, జూన్ 17(విజయక్రాంతి): వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫర్టిలైజర్ యాప్ను తొలగించాలని భారతీయ కిసాన్ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి అనురాధకు, మండల రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
భారతీయ కిసాన్ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ మాధవరెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ఫర్టిలైజర్ యాప్ అమలు వల్ల రైతులు ఎరువుల కొనుగోలులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రైతులకు సులభంగా ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సజ్జన్పల్లి గ్రామ అధ్యక్షుడు నరసింహారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మేడిపల్లి గ్రామ అధ్యక్షుడు వీరప్ప, చిలుకూరు గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు, సత్తయ్య, మండల కార్యవర్గ సభ్యులు బసవరాజ్, ప్రభాకర్ రెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.






