అందరినీ ఆకట్టుకునే మా ఇంటి బంగారం
సమంత ప్రధాన పాత్రలో దర్శకురాలు నందినీరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మం జూష ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 19న విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు డీ సురేశ్‌బాబు, స్వప్నాదత్, జాన్వీ నారంగ్, డైరెక్టర్ దేవా కట్టా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో సమంత మాట్లాడుతూ.. “ఇప్పటివరకు నేను నటిగా ఎంతో ఎంజాయ్ చేశా. నా మీద ఇప్పటికీ అదే ప్రేమను చూపిస్తున్న అభిమానులకు రుణపడి ఉంటా. నేను ఇకపై ఏడాదికి రెండు సినిమాలు అందించాలని అనుకుంటున్నా. ‘మా ఇంటి బంగారం’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది” అని చెప్పారు.
డైరెక్టర్ నందినీరెడ్డి మాట్లా డుతూ.. “టీమ్ నిరంతరం శ్రమించడం వల్లే ‘మా ఇంటి బంగారం’ సాధ్యమైంది. ఇందులో ఇంతవరకు చూసిన సమంత కంటే.. పది రెట్ల సమంతను చూస్తారు” అని తెలిపారు. నిర్మాత రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. “ఈ మూవీ కోసం నందినీతో పనిచేయడం ఆనందంగా ఉంది. సమంత ఓ అద్భుత నటి. మేం హిందీలో ఎన్నో సినిమాలు చేశాం. కానీ దీనికి వస్తున్న స్పందన, ఎగ్జుటైమెంట్ నాకు ఎక్కడా కనిపించలేదు. ప్రేమ, పిచ్చి అనేది తెలుగు పరిశ్రమలోనే ఎక్కువగా ఉంటుంది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హిమాంక్, డైరెక్టర్ డీకే కూడా మాట్లాడారు.






