16 April, 2026 | 1:43 AM

బాలసదనం బాలికలు బాగా చదువుకోవాలి

16-04-2026 12:17 AM

హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ 

హనుమకొండ టౌన్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): బాలికల భవిష్యత్తు బలంగా ఉండాలంటే విద్యే ప్రధాన ఆధారం అని, బాల సదనంలో ఉన్న ప్రతి విద్యార్థిని మంచి లక్ష్యాలతో కృషి చేస్తూ బాగా చదువుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి సూచించారు. బుధవారం హనుమకొండ సుబేదారిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల బాల సదనాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.

బాల సదనంలో ఉన్న విద్యార్థినుల సంఖ్య, వారు అభ్యసిస్తున్న కోర్సులు, వంటశాల నిర్వహణ, ఆహార నాణ్యతపై విద్యార్థినులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటగదిని పరిశీలించి, భోజన నాణ్యతను పరీక్షించారు. వేసవి సెలవుల్లో బాలికల హాజరు, దత్తత ప్రక్రియలపై జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, సూపరింటెండెంట్  కళ్యాణి నుంచి వివరాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల సదనంలోని బాలికల పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, వారికి ఉత్తమ సంరక్షణ, విద్యా అవకాశాలు కల్పించాలని ఆదేశించారు.

దత్తతకు సంబంధించిన దరఖాస్తులు వచ్చిన పక్షంలో, బాలికల గార్డియన్ సమ్మతితో పారదర్శకంగా, వేగవంతంగా చర్యలు చేపట్టాలని సూచించారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి, ఉన్నత స్థాయికి చేరుకునేలా కృషి చేయాలని ప్రోత్సహించారు. ఇద్దరు విద్యార్థినులు జనరల్ నర్సింగ్ కోర్సులో ప్రవేశం పొందేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా సంక్షేమ అధికారి వివరించగా, కలెక్టర్  వారికి అభినందించారు.

సందర్శన సమయంలో లక్ష్మీ ప్రసన్న అనే బాలికకు పుట్టినరోజు కావడంతో, జిల్లా కలెక్టర్ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా దగ్గరకు తీసుకుని ఆశీర్వదించడం ద్వారా బాలికలో ఆనందం నింపారు. అలాగే బాల సదనానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఎం. కళ్యాణి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్చార్జి ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం. మౌనిక, కౌన్సిలర్లు త్రివేణి, గౌతమి తదితరులు పాల్గొన్నారు.