బీజేపీ గెలుపే లక్ష్యం
- ప్రజా సమస్యలపై ఐక్యపోరు
- ఎంపీ ఈటల రాజేందర్
పశ్చిమ బంగాల్లో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో కూడా విజయం సాధించాలనే సంకల్పంతో పార్టీ జాతీయ నాయకత్వం తమకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చిందని, రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలన్నదే తమందరీ లక్ష్యమని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలతో ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు ఇతర ముఖ్య నాయకులతో జరిగిన సమావేశం అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
సమస్యలపై ఐక్యంగా పోరాడాలని, పార్టీని అధికారంలోకి తీసుకురావాలని జాతీయ నాయకత్వం సూచించిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులు, అసైన్డ్ భూములు, హైడ్రా వంటి వాటిపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ప్రజా నాయకత్వం, భరోసా కల్పించడమే తమ బాధ్యత అన్నారు.
తెలంగాణలో బీజేపీని గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించారని, బంగాల్ ఎన్నికల అనంతరం కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రానికి వచ్చారన్నారు. తెలంగాణలో పరిస్థితులను బేరీజు వేసుకుంటూ అధినాయకత్వం మార్గనిర్దేశం చేస్తోందని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, పార్టీ నాయకులుగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాల్సిన బాధ్యత తమందరిపై ఉందని ఈటల స్పష్టం చేశారు.






