8 August, 2026 | 2:05 AM

కలిసి సాగుతాం

08-08-2026 01:25 AM
  1. విభేదాల్లేవు.. భిన్నాభిప్రాయాలే! 
  2. పాత, కొత్త నేతలు అనే తేడా లేదు
  3. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం 
  4. త్వరలో పాదయాత్రలు, బస్సు యాత్రలతో ప్రజా చైతన్య కార్యక్రమాలు 
  5. అందరూ కలిసి పోరాటం చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు నబీన్ దిశానిర్దేశం 
  6. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ 
  7. పార్టీలో చేరేందుకు వేచిచూస్తున్న కీలక నేతలు: బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీజేపీ నేతల మధ్య విభేదాలు, భేదాభిప్రాయలు లేవని, నేతల మధ్య భిన్న అభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. పార్టీలో పాత, కొత్త నేతలు అనే తేడా లేదని ఆయన తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవని, ఒంటరిగానే పోటీచేస్తామని స్పష్టం చేశారు. జనసేన సహా ఏ పార్టీతోనూ తెలంగాణలో పొత్తు పెట్టుకోమన్నారు.

ఎన్డీయేతో జనసేన కలిసి ఉండటమనేది జాతీ య అంశమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారెంటీలపై పోరాటం చేస్తామన్నారు. శుక్రవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్‌రావు, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్ కుమార్, బీజేపీ ఎంపీలు డాక్టర్ కే లక్ష్మణ్, రఘునందన్ రావు, అర్వింద్‌కుమా ర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గోడెం నగేశ్‌తోపాటు రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, బీజే పీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ సమావేశమయ్యారు.

ఈ భేటీ లో రాష్ట్రంలో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై జాతీయ నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు.ఈ భేటీ అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కోర్ కమిటీ సభ్యులతో చర్చించి పాదయాత్రలు, బస్సు యాత్రలు వంటి ప్రజా చైతన్య కార్యక్రమాలను రూపొందించి ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్తామని వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, కీలక నేతలు తమ పార్టీలో చేరేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారని తెలిపారు. బీజేపీలో కొత్త, పాత నేతలు అనే తేడా లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, అందరూ కలిసి పోరాటం చేయాలని నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి రోడ్ మ్యాప్ తయారు చేయాలని ఆదేశించారన్నారు. 

అసెంబ్లీ తర్వాత మరోసారి భేటీ..

రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి ఎంపీ, ఎమ్మెల్యేలతో నితిన్ నబీన్ సమావేశమవుతారని రాంచందర్ రావు తెలిపారు. 937 మండలాలలో పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. సంస్థాగత బలంతో తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

గతంలో తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి మెరుగైన ఓటు బ్యాంకు సాధించామని, పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీని ఆదరించారని గుర్తుచేశారు. ఎన్నికలకు ఇంకా వ్యవధి ఉన్నందున పలు పార్టీల నుంచి నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, సరైన సమయం చూసుకుని వారంతా పార్టీలోకి వస్తారని స్పష్టం చేశారు. రాబోయే డీలిమిటేషన్ తర్వాత స్థానాలు పెరిగినప్పటికీ, బీజేపీ తెలంగాణలో మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

2014 తర్వాత బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో తొలిసారి అధికారం సాధించి, బలమైన శక్తిగా ఎదిగామో, ఆ రాష్ట్రాల కంటే తెలంగాణలో సంస్థాగతంగా బీజేపీ చాలా బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని, ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా విస్తృతంగా పనిచేయాలని నితిన్ నబీన్ స్పష్టమైన మార్గనిర్దేశం చేశారని తెలిపారు.

ఆ స్థానాలు గెలిచేలా..

సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించామని రాంచందర్ రావు వెల్లడించారు. వరంగల్- హైదరాబాద్- నగర్ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) నియోజకవర్గాల స్థానాలను బీజేపీ కైవసం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జనసేన వంటి పార్టీలు జాతీయ స్థాయిలో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నందున జాతీయ స్థాయి నాయకత్వం నిర్ణయిస్తుందని, తెలంగాణలో మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. బీజేపీ నాయకుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకుంటామని తెలిపారు. బిజెపిలో చేరిన మరుసటి క్షణం నుంచే ప్రతి ఒక్కరూ కార్యకర్తగా, నాయకుడిగా పనిచేస్తారని స్పష్టం చేశారు.

ఆ బిల్లులకు ఆమోదమే..

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులు పార్లమెంటులో ఖచ్చితంగా ఆమోదం పొందుతాయని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న డీలిమిటేషన్ మద్దతుదారులు కూడా వీటికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉందన్నారు. బీజేపీ ఏ మంచి నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు.

ప్రస్తుతం ఈ నెల 10వ తేదీ వరకు సర్  జరుగుతున్నందున ఇతర కార్యక్రమాలను వేగవంతం చేయలేకపోయామని చెప్పారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజాపోరాటాలు చేయడమే బీజేపీకి నిజమైన రోడ్‌మ్యాప్ అని నితిన్ నబిన్ స్పష్టం చేశారని తెలిపారు. 

సమసిన విభేదాలు! 

బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలు ఇక సమసిపోయినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని పలువురు బీజేపీ నేతల మధ్య ఉన్న గ్యాప్‌కు చెక్ పెట్టడంపై జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఢిల్లీలో బీజేపీ ఎంపీల వరుస భేటీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య ఉన్న అంతర్గత విభేదాలకు జాతీయ నేతలు ఇప్పటికే పుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రయత్నం చేశారు.

ఇందుకోసం హైదరాబాద్‌లోని బీజేపీ ఎంపీ డా. కే లక్ష్మణ్ నివాసంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్‌పాటిల్.. బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో ప్రత్యేకంగా గతంలో భేటీ అయ్యారు. అంతకు ముందు అర్వింద్ కుమార్‌తోనూ అభయ్‌పాటిల్ సమావేశమయ్యారు. ఈ భేటీలో విభేదాలు పక్కనపెట్టి పార్టీకోసం కలిసి కట్టుగా పనిచేయాలని ఆ సమావేశాల్లో వారికి ఆయన ఆదేశించారు. అలాగే బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి బండి సంజయ్‌తో ఆయన నివాసంలో ఎంపీలు ఈటల, లక్ష్మణ్, విశ్వేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఇక గురువారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఎంపీలు అర్వింద్, డీకే అరుణ, రఘునందన్‌రావు, నగేష్‌తోనూ బండి సంజయ్ సమావేశమయ్యారు. తాజాగా శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడితో బీజేపీ ఎంపీలందరూ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై రాంచందర్‌రావు నివేదికను సమర్పించినట్లు తెలిసింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.