ప్రజల భద్రతే ధ్యేయం
కొత్త లోగో ఆవిష్కరణ, జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర
కామారెడ్డి, జూన్ 17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ, జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర మంగళవారం కామారెడ్డి పోలీసులకు కొత్త లోగోను ఆవిష్కరించారు. Fearless Always. Vigilant Forever.y అనే నినాదంతో రూపొందిన ఈ లోగో, పోలీసింగ్లో ధైర్యం, అప్రమత్తత, పారదర్శకతను ప్రతిబింబించడమే కాకుండా, పోలీసింగ్లో వస్తున్న మార్పుకు ప్రబలమైన ప్రతీకగా నిలుస్తుందన్నారు.
ఇందులో ప్రతిఫలించే నినాదం జిల్లా పోలీసుల నిబద్ధతను, కమిట్మెంట్ను స్పష్టంగా వ్యక్తపరుస్తోందని తెలిపారు. ఈ లోగోను జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, అధికారిక పత్రాలు, సోషల్ మీడియా వేదికలలో అమలులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ లోగో కేవలం గుర్తింపు మాత్రమే కాదు, కామారెడ్డి పోలీస్ శాఖ నిబద్ధత, ప్రజల పట్ల బాధ్యతా భావం, న్యాయబద్ధమైన విధానాలను ప్రతిబింబిస్తుందన్నారు.
పోలీసింగ్ను ప్రజలకు మరింత సమీపంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు మేము నిరంతరం కృషి చేస్తున్నా మనీ తెలిపారు.‘పారదర్శకతే మా బలం ధైర్యమే మా ఆయుధం‘ అనే లక్ష్యంతో పోలీసులు వ్యవహరించాల్సిన దిశగా మార్గదర్శకాలు రూపొందించామని ఆయన తెలిపారు.
ప్రజల భద్రత కోసం ప్రతి అధికారి శ్రద్ధగా, సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ప్రజల మద్దతుతో మరింత శక్తివంతమైన పోలీసింగ్ను అందించేందుకు సిద్దంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు, బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి, సిఐలు పాల్గొన్నారు.




