26 June, 2026 | 2:31 AM

నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యం

26-06-2026 01:28 AM

- ప్రమాదాల తగ్గించేందుకు కృషి

- టీజీ ఎన్ పీ డీ సీ ఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి

బెల్లంపల్లి, జూన్ 25: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడం, ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని టీజీ ఎన్ పీ డీ సీ ఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు.

గురువారం బెల్లంపల్లిలోని 132/33 కేవీ సబ్స్టేషన్, 33/11 కేవీ సబ్స్టేషన్లో రీనోవేషన్, మోడరైజేషన్, కన్నెపల్లి సబ్స్టేషన్లో ఆర్ అండ్ ఎం ప్రతిపాదిత పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని,  విద్యుత్ మౌలిక సదుపాయాల బలోపేతం ద్వారా మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.

ప్రత్యేక భద్రతా విధానం ద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించడం, సిబ్బంది ప్రాణాలను రక్షించడం, విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సురక్షితంగా నిర్వహించడం ముఖ్య ఉద్దేశమన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉన్నందున, ఈ ‘ఒక్క నిమిషం జాగ్రత్త’ సిబ్బంది ప్రాణాలను కాపాడగలదని సూచించారు. వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు రెండవ పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచేr చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం ముత్తాపూర్ (మాడేపల్లి) వద్ద ప్రతిపాదిత 132 కేవీ నూతన సబ్స్టేషన్ స్థలాన్ని, కాగజ్నగర్ డివిజన్ లోని దహెగాం నుంచి బెల్లంపల్లి డివిజన్ లోని కన్నెపల్లి మధ్యలో 18 కిలోమీటర్ల ఇంటర్లింకింగ్ లైన్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయన వెంట మంచిర్యాల సూపరింటెండింగ్ ఇంజినీర్ బీ రాజన్న, డివిజనల్ ఇంజినీర్ (టెక్నికల్) మల్లేశం, ఈఈ (సివిల్) శ్రీనివాస్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు శ్రీనివాస్, రవికుమార్, శరత్ కుమార్, రాంచందర్, రాజ్ కుమార్, ఏఈలు ఇతర ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.