పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం
కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
రంగారెడ్డి, మే 20 (విజయక్రాంతి): ఎలాంటి తప్పులు లేని, పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల నమోదు ప్రక్రియ అక్టోబర్ 1- 2026 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఫామ్-6 ద్వారా కొత్తగా నమోదు చేసుకోవాలని, తప్పుల సవరణకు ఫామ్-8 ఉపయోగించాలని కలెక్టర్ సూచించారు.
జూన్ 15 నుంచి బూత్ స్థాయి అధికారులకు పూర్తి శిక్షణ ఇచ్చి, ఇంటింటి విచారణ చేపడతారన్నారు.రాజకీయ పార్టీలు కూడా తమ బూత్ స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించుకోవాలని కోరారు. రాబోయే జిహెచ్‌ఎంసి ఎన్నికల దృష్ట్యా నకిలీ, మరణించిన ఓటర్ల తొలగింపు, బహుళ అంతస్తుల భవనాల్లో కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మరియు ఒకే ఇంటి నంబరుపై 50 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న చోట ప్రత్యేక పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల ప్రతినిధులు, జిల్లా రెవెన్యూ అధికారి శారద మరియు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.






