26 May, 2026 | 1:26 PM

మౌలిక వసతుల కల్పనే లక్ష్యం

14-12-2024 12:08 AM
  • వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • అశ్వారావుపేటలో అభివృద్ధి పనుల ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 13 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట మండల ప్రాంతాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు శక్తి వంచన లేకుండా కృషి చేశానని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం దమ్మపేట మండలంలోని ఆల్లిపల్లి గ్రామంలో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని, సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.

అనంతరం అల్లిపల్లి గ్రామంలో గ్రామస్థులు నిర్మించుకున్న ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దమ్మపేట, అశ్వారావుపేట ప్రజల ఆశీర్వాదంతోనే అన్ని ప్రభుత్వాల్లో మంత్రిగా కొనసాగే భాగ్యం కల్గిందన్నారు. దశాబ్దాలుగా రాజకీయ రంగంలో కష్టపడి పనిచేస్తూ ప్రజలకు తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులను కల్పించి వారి అవసరాలను తీర్చానన్నారు. ఇంకా మరిన్ని నిధులు తెచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నారని, గిరిజనుల భూముల్లో గిరిజనులే వ్యవసాయం చేసుకోవాలని, గిరిజనేతరులు సాగు చేయడానికి వీలులేదని అన్నారు. కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని మాట్లాడారు. సమావేశంలో జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు, పంచాయతీరాజ్ కాశయ్య, ఆలపాటి ప్రసాద్ పాల్గొన్నారు.