16 April, 2026 | 2:01 AM

గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం

16-04-2026 12:30 AM
  1. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

కల్లూరులో రూ.10.50 కోట్లతో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభం

కల్లూరు మండలం నారాయణపురంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కల్లూరు, ఏప్రిల్ -15 (విజయ క్రాంతి): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.  బుధవారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎన్.పి.డి.సి.ఎల్ సీఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ లతో కలిసి కల్లూరు మండలంలో పర్యటించారు.

ముందుగా కల్లూరు మండలంలో నారాయణపురం గ్రామంలో రూ.2.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు, రూ.10.50 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు.

ప్రతి గ్రామానికి నాణ్యమైన విద్యుత్, వైద్య సేవలు, మౌళిక సదుపాయాలు అందించడమే లక్ష్యమని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, విద్యుత్, ఆరోగ్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, విద్యుత్ శాఖ ఎస్‌ఇ శ్రీనివాసాచారి, డిసిహెచ్‌ఎస్ డా. రాజశేఖర్,  వైద్యాధికారులు, విద్యుత్ శాఖ, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.