30 April, 2026 | 3:43 AM

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

30-04-2026 01:40 AM

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరో మారు అధికారంలోకి రావడానికి మహిళా కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర మహిళా కాంగ్రె స్ అధ్యక్షురాలుగా ఎన్నికైన  ఎర్రబెల్లి స్వర్ణ తొలిసారి కరీంనగర్ జిల్లాకు వచ్చిన సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ నేతలతో కరీంనగర్ లోని ఇందిరా భవన్ లో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 20 23లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాష్ట్ర మహిళలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రాష్ట్ర మహిళలకు చేయూత అందించాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నిర్ణయించారని మంత్రి తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. 

మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి : రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ

రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్వర్ణ తెలిపారు. ఆర్టికల్ 73 , 74 రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీని గుర్తు చేశారు.  బీజేపీ పార్టీ మానవత్వం లేని పార్టీగా ఆమె అభివర్ఢించారు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏనాడు మహిళలను పట్టించుకోలేదని స్వర్ణ ఆరోపించారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామ గ్రామానికి, ఇంటింటికి తిరిగి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేయాలని స్వర్ణ పిలుపునిచ్చారు. సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు మున్సిపల్ చైర్మన్లు తదితరులు హాజరయ్యారు.