19 June, 2026 | 2:52 AM

పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

19-06-2026 12:15 AM

జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లేనినా 

పాల్వంచ, జూన్ 18 (విజయక్రాంతి): గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పోషకాహారంతో పాటు, చిన్నారులకు నాణ్యమైన ఆటపాటాల విద్యను అందించడమే తమ లక్ష్యం అని జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా అన్నారు. పాల్వంచ ప్రాజెక్టు, లక్ష్మీదేవిపల్లి సెక్టార్, ఇంద్రానగర్ అంగన్వాడి కేంద్రం నందు ‘అమ్మమాట అంగన్ వాడి బాట‘ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో నమోదు అయ్యే లబ్ధిదారులకు పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని, ఈ యొక్క ‘అమ్మ మాట అంగనవాడి బాట‘ చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించి లబ్ధిదారుల సంఖ్య పెరిగే విధంగా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కృషి చేయాలన్నారు. 

మొదటి 1000 రోజుల తల్లి బిడ్డల సంరక్షణ ధ్యేయంగా ప్రతి అంగనవాడి కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్య, ఆటపాటలతో కూడిన విద్యను అందించడం, అంగన్వాడి కేంద్రాలలో పెరటి తోట పెంపకం ద్వారా వచ్చే రాబడిని నమోదైన లబ్ధిదారులకు అందజేయాలన్నారు. జిల్లాలో ఏ ఒక్క అంగన్వాడి  కేంద్రాలలో తీవ్ర పోషణ లోపం, అతి తీవ్ర పోషణ లోపంతో బాధపడే వారి సంఖ్య తగ్గించే వరకు అంగనవాడి టీచర్లు  అహర్నిశలు కష్టపడాలన్నారు.

ప్రతి నెల క్రమం తప్పకుండా పిల్లల ఎత్తు, బరువులు తూచి వారి ఆరోగ్య సంరక్షణ కోసమై వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ప్రాజెక్టు సిడిపిఓ లక్ష్మీప్రసన్న, శ్రీనగర్ పంచాయతీ సర్పంచ్ రాణి, లక్ష్మీదేవిపల్లి సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ జిల్లా సమన్వయకర్త సంపత్, మహిళా సాధికారిత జిల్లా కోఆర్డినేటర్ రూప సంతోషి, అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.