05-12-2025 12:31:26 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): హనుమకొండ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో పార్టీలకు అతీతంగా చరిత్రలో నిలిచే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గురువారం 4వ డివిజన్ అక్షర కాలనీ, యాదవ నగర్, 9వ డివిజన్ గణేష్ నగర్ లలో సూమరు రూ.1.20 కోట్లతో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ లు, పైపులైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా వార్డులలో స్థానిక ప్రజలతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించిన సందర్బంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ అడిగిన వెంటనే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం ప్రతి పనిని త్వరగతిన పూర్తిచేసేలా అధికార యంత్రంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ప్రతి డివిజన్లలో అభివృద్ధి పర్యటనలు చేస్తున్న క్రమంలో ప్రజలనుంచి విశేష ఆదరణ కనిపిస్తుందని అన్నారు. ఇటీవలే జరిగిన కౌన్సిలో సుమారు 30 కోట్ల ప్రతిపాదనలు చేశానని, జిడబ్ల్యుఎంసి పరిధిలో గతంలోకంటే మెరుగైన సౌకర్యాలు, సంక్షేమాలు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. జనవరి లోపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు మొదలుకానున్నాయని వెల్లడించారు.
యూడిసి పనులలో కొత్త సీసీ రోడ్లకు సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది చివరకి నియోజవకర్గ పరిధిలో ప్రధాన, అత్యవసర రోడ్లు, డ్రైన్ ల నిర్మాణాలు పూర్తి అవుతాయని హామీ ఇచ్చారు.పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాల విషంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
అధికారులు సైతం జరుగుతున్న పనులను క్షేత్ర స్థాయిలో వెళ్లి పర్యటనలు చేయాలని సూచించారు. నాణ్యత ప్రమాణాల్లో తేడావస్తే అధికారులు, సంబధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ ల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.