9 May, 2026 | 6:36 AM

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

09-05-2026 12:00 AM
  1. మత్స్యకార సంఘాలు బలోపేతం కావాలి
  2. ఫిష్ పాండ్స్ లో చేపల పెంపకంపై దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల, మే 8 (విజయక్రాంతి): ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తుందని, మత్స్యకార సంఘాలు బలోపే తం కావడానికి సభ్యత్వాలు పెంచాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూ ల్లో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారము కార్యక్రమంలో శుక్రవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో మత్స్య అధికోత్పత్తి, వ్యాధి నివారణ, చెరువుల్లో కలుపు మొక్కల నివారణపై మత్స్య కారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో మత్స్యశాఖ కూడా ప్రధానమైనదని, జిల్లాలో చేపల ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. జిల్లాలోని వివిధ జలాశయాల్లో నాణ్యమైన చేప పిల్లలను సకాలంలో వదిలేందుకు రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టర్ తో మాట్లాడతానన్నారు. చెరువుల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు కలవకుండా మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసు కోవాలని సూచించారు. మత్స్యకారులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే రెన్యువల్ చేయడం జరుగు తుందని పేర్కొన్నారు.

రుణాలను సరిగ్గా కట్టని మత్స్యకారులకు అవగాహన కలిగించి, కొత్త రుణాలు పొందేలా ఆయా సంఘాల అధ్యక్షులు కృషి చేయాలన్నారు. ఇందిర మహిళా శక్తి, స్త్రీ నిధి, ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రుణాలను మత్స్యకార కుటుంబాల్లోని మహిళలు తీసుకుని కులవృత్తిని అభివృద్ధి చేసుకుంటే ఆర్థికంగా ఎదగవచ్చన్నారు. బ్యాంకర్స్, సంఘాల అధ్యక్షులు, సభ్యులతో త్వరలో సమన్వయ సమావేశం నిర్వహించి, మత్స్యకారులకు రుణాలు సకాలంలో అందించే విషయాన్ని చర్చించనున్నట్లు తెలిపారు.

పిఎండిడికేవై కు జిల్లా ఎంపికవడంతో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో చెప్పుకోదగ్గ పురోగతి సాధించడానికి అవకాశం ఉందన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వంటి పథకాలను అర్హులైన మత్స్యకారులందరూ సద్వినియోగం చేసుకోవాల న్నారు. చేపలను మంచి ధరలకు అమ్ముకోవాలంటే డిమాండ్ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాలకు కూడా రవాణా చేయాలన్నారు.

ఫిష్ పాండ్స్ లో చేపలు త్వరగా పెరుగుతాయని, వీటిపై మత్స్యకారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. చేపలు తినడం వలన కలిగే లాభాలు, మత్స్యకారులు పట్టిన చేపల గురించి, ఇతర విశేషాలపై సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తే కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందని, ఎక్కువగా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉందన్నారు. సదస్సులో మత్స్యకారులు తెలియజేసిన ఆయా సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

వివిధ సందర్భాల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలను మత్స్యకారులు సద్వినియో గం చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జి ల్లా మత్స్యశాఖ అధికారి షకీలా భాను, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, ఎల్డీఎం శ్రీనివాసరా వు, జిల్లా కోపరేటివ్ అధికారి శ్రీనివాస్, పలు మత్స్యకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు,  తదితరులు పాల్గొన్నారు.