6 May, 2026 | 1:46 AM

మహిళా సంఘాలు సాధికారిక సాధించడమే ప్రభుత్వ లక్ష్యం...

06-05-2026 12:23 AM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..

ఉట్నూర్, మే 5 (విజయక్రాంతి): పొదుపు సంఘాల మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు సాధికారిక సాధించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని శాంతినగర్, బీర్సాయ పేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతి రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పొదుపు సంఘాలను ఆర్థికంగా బలోపేతం అయ్యేవిధంగా వడ్డీలు లేని రుణాలతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం అప్పగిస్తుందని అన్నారు. ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు చేసే వరి ధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్ కు రూ. 500 బోనస్ అందిస్తుందని గుర్తు చేశారు.

రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ముందు వరి ధాన్యం నాణ్యతను పరిశీలించుకోవాలని మహిళా సంఘాలకు సూచనలు చేశారు. వరి ధాన్యాన్ని మిల్లులకు పంపేముందు నాణ్యతను పరిశీలించకుంటే తరుగు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. ఆయనతోపాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, ఆర్టిఏ సభ్యుడు దూట రాజేశ్వర్, మాజీ సర్పంచ్ మర్స్ కోలా తిరుపతి, ఏపిడి గోవిందరావు జాదవ్, డిపిఎం జాడి మల్లేష్ ఐకెపి సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.