27 June, 2026 | 3:34 AM

ప్రజలకు జవాబుదారీగా పనిచేయడమే ప్రభుత్వ లక్ష్యం

27-06-2026 02:10 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, జూన్ 26 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తూ ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.

శుక్రవారం 58వ డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ సౌత్, నార్త్, కేయూ కాలనీ, రాఘవేంద్ర నగర్ ఫేస్ 2, వెంకటేశ్వర టెంపుల్, శ్యామల దుర్గా దాస్ కాలనీలలో సుమారు 1.28 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని దాదాపు అన్ని డివిజన్లో అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన ప్రాంతాల్లో కూడా వేగవంతంగా పనులను చేస్తామని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తమ బాధ్యతగా భావిస్తూ ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు పనులను నిర్దేశిత ప్రమాణాలతో నిరీత గడువులోకి పూర్తిచేయాలని ఆదేశించారు.