22 March, 2026 | 1:44 AM

బ్రాహ్మణపల్లిలో దాగిన చరిత్ర

22-03-2026 12:15 AM

యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని బ్రాహ్మణపల్లి అతిపురాతన కాలం నుంచి మానవావాసంగా వుంది. ఈ ఊరి లో దేవతలగుట్టగా పిలువబడే చిన్నగుట్టల వరుస వుంది. రెండుగుట్టల నడుమ చిన్న లోయ, లోయలో గుహలు, దోనె లు, సొరికెలు చాలా వున్నాయి.

ఒక చిన్నదోనెలో మెరుగుపెట్టని చిన్న, చిన్న ఆదిమానవుల రాతి పనిముట్లు దొరికాయి. వాటిలో వడిసెల రాళ్లు, రాతిసుత్తెలు, గొడ్డళ్లుగా చేయడానికి సిద్ధపరిచిన రాతి ముక్కలు, బొరిగెలవంటివి వున్నాయి. అక్కడే వేణుగోపాలస్వామి గుడి వుంది. గుడికి తూర్పున బండగట్టుగా ఒక ఆదిమానవుల సమాధి వుంది. 16 చిన్న, చిన్న రాతిగుండ్లను సమాధి చుట్టూ పేర్చారు. అది ఒక కైరన్ సమాధి. ఇంకా సమాధులుండే అవకాశముంది. దొరికిన రాతిపనిముట్లను బట్టి అవి మధ్యశిలాయుగం (క్రీ.పూ.8500 సం.లు)నాటివని తెలుస్తున్నది. 

8, 9వ శతాబ్దాల్లోనే దేవాలయ నిర్మాణం 

బ్రాహ్మణపల్లిలో 8, 9వ శతాబ్దాలలోనే దేవాలయ నిర్మాణం జరిగిందనిపిస్తుంది. వేణుగోపాలస్వామి గర్భగుడి సుద్దాలలోని వేణుగో పాల స్వామిగుడి అంతరాళాన్ని పోలివుంది. ద్వారం ఉత్తరాశిమీద లలాటబింబంగా తిరునామాలే వున్నాయి. నిర్మాణశైలి ఒకేవిధంగా వుంది. గుట్టమీద కావడం వల్ల గుడి చిన్నగా వుంది. కాని, లోపల అర్చామూర్తులే తప్పా వేణుగోపాలస్వామి విగ్రహం లేదు. గుడి బయ ట ఉత్తరం వైపు బండమీద పెద్ద అక్షరాలతో తెలుగులిపిలో రాతవుం ది. జీర్ణమైపోవడం వల్ల చదవడం అసాధ్యంగా వుంది. అక్కడ గుడి బయట తూర్పున కిందవైపు ఒక నంది వుంది. శివలింగం లేదు. అంటే ఇక్కడ కూడా ఒకప్పడు శివాలయం వుండేదన్నమాట. ఇవి కూడా 10, 11 శతాబ్దాలనాటివని తోస్తున్నది. గుడిగోడల్లో కనిపించే స్తంభాలు రాష్ట్రకూటశైలిలో కనిపించడం విశేషం.

ద్వారశాఖలమీద కనిపించే కలశాలు, ఊరిబయట లభించిన పాదాలు... ఇక్కడ ఒకప్పు డు జైనం వుండేదని తెలిపే ఆనవాళ్లు. గ్రామంలో పడమట వూరవతల పాతగుడి వుంది. ఆ గుడిలో రెండడుగుల ఎత్తున చతురస్రాకారపు పానవట్టం, శివలింగం, అరడుగుఎత్తు, అడుగుపొడుగున్న నంది, వినాయకవిగ్రహం, అడుగుఎత్తున్న రాతిపలకపై అభయాంజనేయుని అర్చారూపం, మూడడుగుల ఎత్తున్న చక్కని లక్ష్మీసమేతనారాయణుని విగ్రహం వున్నాయి. ఈ గుడిని కొండగడప సుబ్బావధాని(ఇప్పటికి ఎన్ని తరాలకిందనో) కట్టించాడట. (ఆఇంటికోడలు చెప్పారు). మాన్యం వుండేదట. అసలు బ్రాహ్మణపల్లే బ్రాహ్మణుల అగ్రహారం కావడం వల్లనే వూరికా పేరు వచ్చివుంటుంది. స్థానిక చరిత్రలు దొరికితే ఇంకా చరిత్ర ఆనవాళ్లు ఎక్కువగా లభించేవి. ఆంజనేయుని గుడి వద్ద నాగులశిల్పాలున్నాయి. పాతగుడి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.