27 July, 2026 | 9:45 PM

నూతన జిల్లా జడ్జికి ఘన స్వాగతం.. ఇన్‌చార్జి జడ్జికి వీడ్కోలు

27-07-2026 08:40 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా నూతన ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన శారదాదేవికు ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘన స్వాగతం పలికారు.గత ఆరు నెలలుగా ఇన్‌చార్జి జిల్లా జడ్జిగా సేవలందించిన వీరయ్యకు వీడ్కోలు కార్యక్రమాన్ని బార్ అసోసియేషన్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి సాంకేత్ మిత్ర మాట్లాడుతూ... ఆసిఫాబాద్ బార్ రాష్ట్రంలోనే ఆదర్శ బార్‌గా నిలవాలని ఆకాంక్షించారు. జూనియర్ సివిల్ జడ్జి జక్కుల అనంతలక్ష్మి మాట్లాడుతూ... బార్–బెంచ్ సంబంధాలు ఇదే స్ఫూర్తితో కొనసాగాలని, కేసుల పరిష్కారంలో ఆసిఫాబాద్ బార్ మంచి గుర్తింపు పొందిందని అన్నారు.

అనంతరం బార్ అసోసియేషన్ తరఫున నూతన జిల్లా జడ్జి శారదాదేవి, ఇన్‌చార్జి జిల్లా జడ్జి వీరయ్యలను శాలువాలతో సత్కరించి అయోధ్య రామాలయ జ్ఞాపిక, పూల మొక్కలను అందజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోనగిరి సతీష్‌బాబు మాట్లాడుతూ జిల్లాకు 10+2 కోర్టు భవనం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక కోర్టు మంజూరు చేయాలని జిల్లా జడ్జిని కోరామని తెలిపారు. దీనిపై జిల్లా జడ్జి సానుకూలంగా స్పందిస్తూ కొత్త కోర్టులు మంజూరయ్యేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు టి. సురేష్, ఎం. సురేష్, నీకోడే రవీందర్, నరహరి, డి. వెంకటేశ్వర్లు, జగన్మోహనరావు, రవీందర్ రెడ్డి, జూనియర్ న్యాయవాదులు, న్యాయవాదుల గుమస్తాల సంఘం ప్రతినిధులు శివ చందు, ముక్రం ఖాన్, సిడం శంకర్ తదితరులు పాల్గొన్నారు.