27 July, 2026 | 9:44 PM

పీఎంఈజీపీ రుణాల్లో అవకతవకలపై విచారణ చేపట్టాలి: బీజేపీ నేతల డిమాండ్

27-07-2026 08:42 PM

- అనర్హులకు రుణాలు, సబ్సిడీలు అందుతున్నాయంటూ డీసీసీబీ రీజినల్ మేనేజర్లకు వినతి

సత్తుపల్లి,(విజయక్రాంతి): ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) అమలులో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి, నిజమైన అర్హులైన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డీసీసీబీ సంబంధిత బ్యాంకుల రీజినల్ మేనేజర్లను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చదువుకున్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంఈజీపీ పథకం సత్తుపల్లి ప్రాంతంలో అసలు లక్ష్యానికి విరుద్ధంగా అమలవుతోందనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఆర్థికంగా బలమైనవారు, రాజకీయ పలుకుబడి ఉన్నవారు కూడా ఈ పథకం ద్వారా రుణాలు పొంది, కేవలం సబ్సిడీ ప్రయోజనం కోసం మాత్రమే యూనిట్లు ఏర్పాటు చేసినట్లు చూపిస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.

రుణాల మంజూరులో మధ్యవర్తులు, ప్రభావశీలులు, కొందరు అధికారుల ప్రమేయంపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే కొన్ని రుణాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. పీఎంఈజీపీ ద్వారా మంజూరైన రుణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని, యూనిట్లు వాస్తవంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారా అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, తప్పుడు పత్రాలతో సబ్సిడీలు పొందిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అర్హులైన నిరుద్యోగ యువతకు పారదర్శకంగా రుణాలు మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మధ్యవర్తుల జోక్యాన్ని పూర్తిగా అరికట్టి, పథకం అసలు లక్ష్యం నెరవేరేలా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని కోరారు.