08-08-2025 01:09:55 AM
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు అధిష్ఠానంపై తరచు విమర్శలు చేస్తుండటంతో పార్టీ తీవ్రంగా పరిగణించింది. దీంతో రాజగోపాల్‌రెడ్డి నుంచి వివరణ తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. అయితే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సమయంలో మంత్రి పదవి ఇస్తామని ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చారని ఆయన పదేపదే చెబుతున్నారు.
అయితే రాజగోపాల్‌రెడ్డి సొంత అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రస్తుతం మంత్రివర్గంలో కొనసాగుతున్నాడు. సామాజిక సమీకరణాల దృష్ట్యా రాజగోపాల్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేకుండా పోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారాయి.
ఆయనకు అధిష్టానం మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డికి అడ్డుకునే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా పార్టీ హైకమాండ్ పరిధిలోనే పనిచేస్తాయి. కానీసీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేయడంపై పార్టీ కాస్త సీరియస్‌గానే పరిగణిస్తోంది.
మంత్రి పదవి రాలేదనే బాధ
మంత్రి పదవి రాలేదనే బాధతతో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ నేతలపైన రాజగోపాల్‌రెడ్డి విరుచుకుపడుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే పార్టీకి ఇబ్బందికర పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ‘ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేది. కానీ నియోజకవర్గ ప్రజల కోసమే మునుగోడు నుంచి పోటీ చేశాను. తనకు పదవి వస్తే అది ప్రజలకే ఉపయోపడుతుంది.
అందరిలా పైరవీలు చేస్తూ దోచుకునేవాడిని కాదు. పదవీ కోసం కాళ్లు పట్టుకోను, అవసరమైతే మళ్లీ రాజీనామా చేస్తా. పదేళ్లు నేనే ముఖ్యమంత్రినని రేవంత్‌రెడ్డి చెప్పడం తప్పు. సోషల్ మీడియా జర్నలిస్టులను రేవంత్‌రెడ్డి అవమానించారు. సోషల్ మీడియాను గౌరవించాలి, అవమానించడం సరికాదు. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్న లిస్టులకు నా మద్దతు ఉంటుంది’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
అంతేకాకుండా ‘రైతు భరోసా’ పథకం అందరి రైతులకు అందలేదని, సీఎం రేవంత్‌రెడ్డి తప్పు మాట్లాడినా తాను నిర్మోహమాటంగా చెబుతా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక సీనియర్ నేత జానారెడ్డిపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి ధృతరాష్ర్టుడి పాత్ర పోషిస్తున్నారు.’ అని ఆయన ఘాటుగా విమర్శలు చేశారు.
10న పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం
ఈ నెల10న పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం గాంధీభవన్‌లో ఉదయం 11 గంటలకు జరగనుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగే సమావేశంలో పార్టీ నేతలపై వచ్చిన ఫిర్యాదులు, పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానంపై తరుచు విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విషయంలోనూ చర్చించే అవకాశం ఉంది.