08-08-2025 01:07:12 AM
హైదరాబాద్ సిటీబ్యూరో/మేడ్చల్, ఆగస్టు 7 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్‌స్టేషన్- ఈగిల్ బృందా లు భారీ అంతర్రాష్ర్ట గంజాయి ముఠా గుట్టును రట్టు చేశాయి. ఈ కేసులో కర్ణాటకకు చెందిన కీలక సూత్రధారి అయిన మహిళతో పాటు, ఓ స్థానిక పెడ్లర్‌ను అరెస్ట్ చేసి, వారి నుంచి 1.5 లక్షల విలువైన 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన పెడ్లర్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు లోకి వచ్చాయి. ఈ ముఠా నుంచి గంజా యి కొనుగోలు చేస్తున్న వారిలో మేడ్చల్‌లోని మెడిసిటీ మెడికల్ కళాశాలకు చెందిన 26 మంది వైద్య విద్యార్థులు ఉన్నట్లు తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు, ఆగస్టు1న హెచ్‌ఎన్‌పీఎ,-ఈగిల్ బృందా లు సికింద్రాబాద్ బొల్లారానికి చెందిన అర్ఫత్ అహ్మ ద్ ఖాన్ (23) అనే స్థానిక డ్రగ్ పెడ్లర్‌ను అరెస్ట్ చేశాయి. అతని నుంచి 2 కిలోల గంజాయి, బైక్, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, 2న రిమాండ్‌కు తరలించారు.
84 మంది గంజాయి కొనుగోలు
అర్ఫత్ అహ్మద్‌ను విచారించగా, అత ని వద్ద 84 మంది గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ 84 మందిలో మేడ్చల్ జిల్లాలోని ఘన్‌పూర్‌లోని మెడిసిటి మెడికల్ కాలేజీకి చెందిన 26 మంది వైద్య విద్యార్థులు ఉండటం. పోలీసులు వెంటనే స్పందించి విద్యార్థుల మూత్ర నమూనాలను పరీక్షించగా, 8 మంది గంజాయి సేవించినట్లు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
నలుగురు విద్యార్థులను తదుపరి పరీక్షల కోసం టెనెట్ డయాగ్నోస్టిక్ కేంద్రానికి పంపించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్ సింగ్ నేగీ, హెచ్‌ఓడీ పవన్ కుమార్ శర్మ, వార్డెన్ల సమక్షంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
అర్ఫత్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేసిన ఈగిల్ బృందాలు, ఆగస్టు 5న ఈ రాకెట్ వెనుక ఉన్న కీలక సూత్రధారి, కర్ణాటకలోని బీదర్‌కు చెందిన జరీనా భాను (46)ను అరెస్ట్ చేశాయి. ఆమె నుంచి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
వ్యసనం కోసం పెడ్లర్‌గా
గంజాయికి బానిసైన అర్ఫత్ అహ్మద్ ఖాన్, తన వ్యసనం కోసం పెడ్లర్‌గా మారాడు. బీదర్‌కు చెందిన జరీనా భానుతో సంబంధాలు పెంచుకుని, ఆమె నుంచి పెద్దమొత్తం లో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో స్థానికంగా విక్రయించేవాడు. ఏడాది కాలంలోనే ఆమె యూపీఐ ఖాతాకు రూ. 6 లక్షలు బదిలీ చేశాడు. జరీనా భాను 2010 నుంచి ఈ దందాను నిర్వహిస్తోంది.
మహారాష్ర్టలోని పర్లీ నుంచి, బీదర్‌లోని స్థానిక సరఫ రాదారుల నుంచి గంజాయి సేకరించి హైదరాబాద్‌లోని 51 మంది పెడ్లర్లకు సరఫరా చేస్తోంది. ఆమె బ్యాంకు ఖాతాలను పరిశీలించగా, ఏడాదికి రూ. 1.5 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అర్ఫత్, జరీనా ఇద్ద రూ పాత నేరస్థులే. అర్ఫత్‌పై గతంలో తుకారాంగేట్ పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ కేసు ఉం ది. జరీనాపై బీదర్‌లో, హైదరాబాద్‌లో పలు కేసులు ఉన్నాయి. ఆల్వాల్ పీఎస్ కేసులో ఇద్దరూ పరారీలో ఉన్నారు.
విద్యాసంస్థల్లో డ్రగ్స్ టెస్టులు
ఈ అరెస్టుల నేపథ్యంలో పోలీసులు కీలక ప్రకటన చేశారు. రాష్ర్టవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో తరచూ డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తామ ని హెచ్చరించారు. క్యాంపస్‌లలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వొద్దని యాజమాన్యాలను ఆదేశించారు. యువత, విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలు కావొద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే 8712671111 నంబర్‌కు తెలియజేయాలని కోరారు. డీఎస్పీ కె. నర్సింగ్ రావు పర్యవేక్షణలో, ఇన్‌స్పెక్టర్ పి. వెంకటేశ్వర్లు, ఎస్సులు బి. సుదర్శన్ యాదవ్, కె. వెంకటరమణ, ఈగిల్ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.