08-08-2025 01:12:54 AM
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): అధికారంలోకి వచ్చిన తర్వా త పాలనలో వైఫల్యంతో, చేతకానితనంతో, అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పు లు చేస్తూ రాష్ర్ట ఆర్థిక వ్యవస్థను అథ:పాతాళానికి తొక్కేశారని సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పైకి మాత్రం గురివింద గింజలాగా తన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని వి మర్శించారు.
గురువారం ఢిల్లీలో ప్రెస్‌మీట్ లో కేంద్రమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో కేంద్రం, బీజేపీ, ప్రధాని మోదీ మీద విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇచ్చిన హామీలకు రేవంత్‌తోపాటు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ పూర్తి బాధ్యత వ హించాలన్నారు.
డిక్లరేషన్ పేర్లతో బీసీల కో సం ఏమీ చేయకుండానే ఢిల్లీ బాటపట్టి, అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ 18 నెలల్లో ఢిల్లీ ప్రదక్షిణ తప్ప తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రేవంత్, రాహుల్ అద్దాలమేడలో కూర్చుని ఇతరులపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.
గెలిపించుకునే సత్తా రాహుల్‌గాంధీకి లేదు
మోదీని గద్దె దించేందుకు శిలాశాసనం రాస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారని, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ర్టంలో గెలిచినా రాహుల్ ఏం చెప్పి నా చేసేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. తిరిగి గెలిపించుకునే సత్తా కాంగ్రెస్‌కు, రాహుల్‌గాంధీకి లేదని కుండబద్దలు కొట్టా రు. మోదీకి సవాల్ విసరడం అంటే సూర్యుడిపై ఉమ్మేసినట్టేనని హెచ్చరించారు.
తెలం గాణలో ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్‌కు మరణ శాసనం రాశారని పేర్కొన్నారు. సోనియా కుటుంబాన్ని పొగడటానికి, ప్రధానిని తిట్టేందుకే జంతర్‌మంతర్ సభ పెట్టారని, సభ వైపు పార్టీ అగ్రనేతలు కనీసం కన్నెత్తి కూడా చూడలేదని ఎద్దేవా చేశారు.
రేవంత్‌రెడ్డి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టకుండ అవినీతిలో మాత్రం బీఆర్‌ఎస్‌తో పోటీ పడుతున్నారం టూ ఆరోపించారు. నాడు కేసీఆర్ హోల్ సే ల్‌గా అవినీతి చేస్తే.. కాంగ్రెస్ పార్టీ రిటైల్‌గా అవినీతికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. అవినీతిలో, అప్పుల్లో అగ్రస్థానంలో తెలంగాణ రాష్ర్టం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముస్లిం రిజర్వేషన్ ఇచ్చేందుకు
గతంలో కేసీఆర్ 12 శాతం ముస్లిం రిజర్వేషన్ ఇచ్చేందుకు అనేక రకాల కుట్రలు చే శారని ఆరోపించారు. ఇవాళ 34 శాతం ఉ న్న రిజర్వేషన్లను 32 శాతానికి తగ్గించేందు కు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన 42 శాతం ఉండాల్సిన బీసీ రిజర్వేషన్లకు అన్యాయం చేశారన్నారు. అందులో 10 శాతం ముస్లింలను చేర్చారని మండిపడ్డారు.
జీహెచ్‌ఎంసీ గత ఎన్నికల్లో బీసీలకు 50 సీట్లు రిజర్వ్ చేస్తే, ఇందులో 31 మంది నాన్-బీసీలు గెలిచారని, ఇలాంటి పరిస్థితుల్లో బీసీలకు ఎలా న్యాయం చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒవైసీ కుటుంబానికి సీ ఎం పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వాపోయారు. ముస్లింలకు ఏ విధంగా 10% రిజర్వేషన్లు ఇస్తారని ప్రశ్నించారు. బీసీల పేరుతో మతపరమైన రిజర్వే షన్లు ఇస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు.
పదవుల కోసం పార్టీ మారం
ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, దానిని మళ్లీ రాష్ర్టపతికి పంపాల్సిన అవసరం ఉండదన్నారు. చట్ట, న్యాయపరమైన అంశాలపై అ నుమానాలుంటేనే రాష్ర్టపతి సూచన కోసం పంపిస్తారని పేర్కొనారు. అవసరాల కోస మో, పదవుల కోసమో పార్టీలు మారే అలవాటు తమకు లేదన్నారు. రాష్ర్టపతిపై ఓ మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మంత్రి వ్యాఖ్యలపై సోనియాగాంధీ బేషరతుగా క్షమాపణలు చె ప్పాలని డిమాండ్ చేశారు.
మోదీని రేవంత్ కన్వర్టెడ్ బీసీ అన్నారని, మరి మీరు కన్వర్టెడ్ కాంగ్రెస్ సీఎంవా అని ప్రశ్నించారు. కాంగ్రె స్ అధికారంలో ఉన్నప్పుడే మోదీ కులాన్ని బీసీల్లో చేర్చారని, అదే సమయంలో విశ్వబ్రాహ్మణ కులాన్ని బీసీల్లో, బంజారాలను ఎస్టీల్లో చేర్చారని, వారిని కూడా కన్వర్టెడ్ కులాల వారు అని అనగలరా అని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్నారు.