5 July, 2026 | 1:34 AM

చారిత్రక గ్రామం కలబగూర్

05-07-2026 12:00 AM

చరిత్రబృందం సహచరుడు, మిత్రుడు మా భద్రగిరీశ్ అందిస్తున్న చారిత్రక విశేషగాథ ఇది. తెలంగాణాలో సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలంలోని కలబగూర్ ప్రాచీన చారిత్రక గ్రామం. కలబగూరు లేదా కల్పగురు, కలబగూజ్ అని పిలువబడే ఈ ఊరిలో 4 శాసనాలు దొరికాయి. మొదటిది పశ్చిమ చాళుక్య చక్రవర్తి ఇరివబెడెంగ సత్యాశ్రయుని కాలంనాటి శాసనశకలం.

మొదటి మూడు పంక్తులే మిగిలివున్నాయి. 2, 3 కాశీవిశ్వేశ్వరుని భక్తుడు అద్వైతమతబోధకుడు మాణిక్యప్రభు పేరుతో వేయబడిన శాసనాలు. ఈ రెండు కూడా తొమ్మిది పంక్తులవే. నాలుగవది ఆంజనేయుని విగ్రహం ముందున్న స్తంభం మీద నాలుగు పంక్తులలో రామనామం చెక్కివున్నది.

కాశీవిశ్వేశ్వరునిగుడి త్రికూటాలయం

కలబగూరు కాశీవిశ్వేశ్వరుడి గుడి త్రికూటాలయం. ఈ దేవాలయం నిర్మాణశైలి చాళుక్యులనాటిది అనిపిస్తున్నది. దేవాలయం రెండు, మూడుసార్లైనా పునరుద్ధరణలకు గురయివుంటుంది. అందువల్ల దేవాలయ మంటప స్తంభాలు, దేవాలయంలోని దేవతామూర్తులు కొత్తగా చేర్చబడ్డాయి. తొలుత చాళుక్యులకాలంలో ముఖ్యంగా ఇరివబెడెంగ సత్యాశ్రయుని కాలంలో జైన, శైవమతాల మధ్య ఘర్షణలు జరిగినట్లు చరిత్రలో ఆధారాలున్నాయి.

చాళుక్యులలో కొందరు పాలకులు, పాలకుల రాణులు జైనాన్ని అభిమానించి జైనబసదులకు దానాలిచ్చారు. కొందరు శివాలయాలు నిర్మింపజేసారు. చాళుక్యుల శాసనం దొరికిన ఈ త్రికూటాలయం కాకతీయుల కాలంలో పునరుద్ధరణకు గురైంది. ఆధునికులు దేవాలయంలోపల చాలా మార్పులు చేశారు. గర్భాలయంలో నేలమట్టంగావున్న చతురస్రాకారపు పానవట్టం మీద అడుగుఎత్తుకు తక్కువగావున్న శివలింగం ప్రతిష్టితమైవుంది.

దాని ముందర నంది చాళుక్యశైలిలో చెక్కబడిన శిల్పం. గర్భాలయ, అంతరాళాల పిదప దేవాలయ ముఖమంటపం తర్వాత కాకతీయశైలిలో అమర్చబడి నట్లనిపిస్తుంది. అంతరాళం బయటవున్న రెండు స్తంభాలు రాష్ట్రకూటశైలికి చెందినవి. దేవాలయ ప్రస్తరాలు కాకతీయుల శైలిలో కూర్చబడ్డాయి. నందిమంటపంలో అధిష్టానపీఠం మీద ప్రతిష్టించబడిన నంది కాకతీయశైలిలో వుంది.  మంటప స్తంభాల మీది నగిషీపని, మదనికల వంటి స్త్రీమూర్తులు కాకతీయశిల్పాన్ని స్మరింపజేస్తుంటాయి.

గర్భాలయంలో శివలింగం వెనక వేదికమీద అనంతపద్మనాభుడుండటం విశేషం. కాశీవిశ్వేశ్వరుడి గుడిలో అనంతపద్మనాభుని కొలువు.. ఆబాది రామగుండం, వెల్దుర్తి శివాలయాలలో అనంతపద్మనాభుని విగ్రహాలున్నట్లే ఇక్కడ కూడా ఈ అనంతపద్మనాభుని ఆరాధన 15శతాబ్దంలో ప్రారంభమైవుండవచ్చు.

రంగనాథునికి, అనంత పద్మనాభునికి కొంచెం భేదాలున్నాయి. ఇదే గుడిలో మరొకశిల్పం వుంది అది మాణిక్యప్రభుది అయివుండాలి. మాణిక్యప్రభు పేరుమీద 2చిన్నశాసనాలున్నాయి కదా. మాణిక్యప్రభు అద్వైతమతగురువు. తాను కాశీవిశ్వేశ్వరారాధకుడు. 

గుడి ప్రాంగణంలో మెట్లబావి

ఈ గుడి ప్రాంగణంలో వున్న మెట్లబావి చాలా ప్రత్యేకమైంది. నాలుగు అంతస్తుల లోతు కలిగివున్న ఈ బావి లోపలకి దిగే మెట్లు నాలుగు మూలల నుంచి మొదలయి కిందికి చేరుతాయి. పైనుంచి చూస్తే ఈ మెట్లబావి స్వస్తిక్ ఆకారంలో కనిపిస్తుంది. విశిష్ట నిర్మాణం గల ఈ మెట్లబావిని బాగుచేయిస్తే బాగుంటుంది. అద్భుతమైన కళాకౌశలంతో బావినేకాదు నీటిని కాపాడుకున్నవాళ్ళమవుతాము. మరొక మెట్లబావి దుర్గమ్మగుడి దగ్గర వుంది.

కాని, ఇంత నిర్మాణం కాదు. పూర్తిగా చెత్తనింపి పాడుచేసారు. గ్రామంలో కనిపించిన వీరగల్లు రాచహోదా వీరునిది. గుర్రమెక్కివున్న వీరుని తలపై రాజచిహ్నం ఛత్రం పట్టివుంది. వీరుడెక్కిన గుర్రంకాళ్ళ నడుమ పడిపోయిన శత్రువీరుడున్నాడు. ఇటువంటి శిల్పాలు కాకతీయుల కాలంలో ఎక్కువ వేయబడ్డాయి. ఐనవోలు, తరిగొప్పుల ఇట్లా చాలాచోట్ల ఇటువంటి వీరగల్లులు కనిపిస్తాయి. రెండవ శిల్పం భైరవమూర్తిది.

శ్రీరామోజు హరగోపాల్,

కన్వీనర్, కొత్త తెలంగాణ

చరిత్రబృందం

99494 98698