పేదల గుడిసెలు కూలినై!
- పోలీసు బందోబస్తు నడుమ - వందలాది ఇళ్ల తొలగింపు
ఖమ్మం భూదాన్ భూముల్లో అక్రమంగా నిర్మించుకున్నారని అధికారుల చర్యలు
ఖమ్మం, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి): ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో గత కొద్ది సంవత్సరాలుగా పేదలు ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉం టున్నారు. మంగళవారం తెల్లవారు జాము న అధికారులు వందలాది మంది పోలీసులు, జేసీబీలు, ట్రాక్టర్లతో ఆ ప్రదేశానికి చేరుకున్నా రు. భూధన్ భూముల్లో అక్రమంగా ఏర్పాటుచేశారంటూ ఇళ్లను తొలగించారు. కాగా వెంట నే అందరూ ఖాళీ చేయాలని గత నెల 17వ తేదీ భూదాన్ యజ్ఞ బోర్డు నోటీసులు జారీ చేసిందని అధికారులు తెలిపారు.
ఒక్కసారిగా వెళ్లమంటే తాము ఎక్కడికి వెళ్తామని, గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని, రూపాయి రూపాయి కూడగట్టుకుని ఇల్లు నిర్మించుకున్నామని ప్రభుత్వం ఈ విధంగా ఖాళీ చేపించటం సబబు కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామునే వేలాదిగా పోలీసులు మోహరించడంతో అక్క డ భయానక వాతావరణం నెలకొంది.
చిన్నపిల్లలు బోరున విలపించారు. ప్రభుత్వ పెద్దలను నమ్మి ఓటు వేసినందుకు మాకు తగిన శాస్తి చేశారని, మమ్ములను రోడ్డుపాలు చేసిన వారు బాగుపడరని మహిళలు శాపనార్థాలు పెట్టారు. వారికి వేరే ప్రదేశంలో నివాసాలు లేకుండా ఒక్క సారిగా వారి ఇళ్లను తొలగించ టం అమానుషమని వివిధ పార్టీలు ఖండించాయి.
భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకే
తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకు వెలుగుమట్ల భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి అన్నారు. అడిషనల్ డీసీపీ ప్రసాదరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. 1953లో కలవల రాజా రామారావు సర్వే నెంబర్ 147, 148,149 లో 31 ఎకరాల 7 గుంటల భూమి భూదాన్ ఉద్యమంలో దానం చేశారని తెలిపారు.
భూ దాన్ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని గమనించిన ఖమ్మం అర్బన్ తహసిల్దార్ 2019లో ఆక్రమణలు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారని తెలిపారు. తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టిందని, ఆక్రమణదారులు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసిందన్నారు. తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకు వెలుగుమట్ల భూ దాన్ భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలిపారు.




