కేయూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శాసనమండలిలో తీన్మార్ మల్లన్న ప్రస్తావన
హనుమకొండ, మార్చి 18 (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీలో ఒప్పంద, ఔట్సోర్సింగ్ తదితర పద్ధతుల్లో నియమితులైన ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని శాసనమండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రస్తావించారు. బుధవారం జరిగిన శాసనమండలి సమావేశంలో మల్లన్న మాట్లాడుతూ ఇటీవల తాను కాకతీయ యూనివర్సిటీని సందర్శించగా ఏండ్ల తరబడిగా చాలీచాలని వేతనం,
కనీస వసతులు సౌకర్యాలు లేకుండా ఉద్యోగులు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తన దృష్టికి తెచ్చారన్నారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క కాకతీయ యూనివర్సిటీ మాత్రమే కాదని, రాష్ట్రవ్యాప్తంగా విద్యావ్యవస్థలో ఉన్న సమస్యలన్నీ తక్షణం పరిష్కరించి, విద్యా బోధనకు మెరుగైన వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.




