జాక్‌పాట్ సర్కార్
కాంగ్రెస్‌ను మెచ్చి ప్రజలు ఓట్లు వేయలేదు..
- భాగ్యలక్ష్మి బంపర్ డ్రాలా అధికారం వచ్చింది..
- ఎన్నికల ముందు జేమ్స్‌బాండ్స్‌లా బాండ్స్ రాసిచ్చారు..
- పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖం చాటేశారు..
- యాక్టర్లు, యాంకర్లకు సీఎం రేవంత్ పేరు గుర్తుకురావడం లేదు..
- సీఎం ఆ ఉక్రోషంతోనే కేసీఆర్‌పై లేనిపోని విమర్శలు చేస్తున్నారు..
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- హుజూర్‌నగర్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లోకి
- గులాబీ కండువా కప్పి సాదర ఆహ్వానం
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి భాగ్యలక్ష్మి బంప ర్ డ్రాలా అధికారమనే జాక్‌పాట్ కొట్టారే తప్ప, వారిని నమ్మి జనాలు ఓట్లు వేయలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎద్దేవా చేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేత పిల్లుట్ల రఘుతో పాటు హుజూర్‌నగర్ నియోజకవర్గానికి పలువురు ఆదివారం హైదరాబాద్‌లోని తెలం గాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఓటు వేసి మోసపోయామని, నష్టపోయామని నల్లగొండ రైతాంగం చెబుతున్నదని పేర్కొన్నారు. 60 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ మూసీ నిండా మురికి నింపి గబ్బు లేపిందని మండిపడ్డారు. నల్లగొండలో ఫ్లోరోసిస్‌ను పట్టిం చుకోలేదని ధ్వజమెత్తారు. నల్లగొండలోని రామిరెడ్డి అనే రైతు నీళ్ల కోసం ఏకంగా 50కి పైగా బోర్లు వేశాడని, చివరకు చుక్కనీరు పడలేదని గుర్తుచేశారు.
నీళ్లసంగతి పక్కన పెడితే ఇప్పుడా రైతు పేరు బోర్ల రామిరెడ్డిగా మారిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీలో కమల్ హాసన్‌ను మించి న నటులు ఉన్నారని, ఎన్నికల ముందు బ్రహ్మాండంగా నటించి, గ్యారెంటీ కార్డులను భద్రంగా పెట్టుకోమని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత నోగ్యారెంటీ అంటున్నారని మండిపడ్డారు. జేమ్స్ బాండ్స్‌లా మాదిరి బాండ్ పేపర్లు రాసి ఇచ్చి, ఇప్పుడు ముఖం చాటేశారని మండిపడ్డారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో మొదలైన తమ పార్టీ ప్రయాణం 25 ఏళ్లు పూర్తి చేసుకుందని, 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్ల పాలక పక్షంలో ఉందని కొనియాడారు. రెండున్నరేళ్లుగా ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నదని వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా కొంతమంది తమకు సరైన గుర్తింపు రావడం లేదనే కేసీఆర్‌ను విమర్శిస్తూ కాలం వెళ్లదీస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ౨023 సాధారణ ఎన్నికల కంటే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలం పెరిగిందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలు మోసపోయాయి..
సీఎం రేవంత్‌రెడ్డి పేరు గుర్తురాక ఒక యాంకర్ మంత్రిశ్రీధర్‌బాబు పేరును ప్రస్తావించారని కేటీఆర్ గుర్తుచేశారు. యాక్టర్లు, యాంకర్లు మాత్రమే కాదు చివరికి ప్రజలు కూడా సీఎం రేవంత్‌రెడ్డి పేరు ఎత్తేందుకు సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. ఎవరూ తనను గుర్తు పట్టలేదన్న ఉక్రోషంతోనే రేవంత్‌రెడ్డి ప్రతిరోజు కేసీఆర్ పైన అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేవలం కేసీఆర్‌ను ఏదో నాలుగు మాటలు అని పైశాచికానందం పొందితే వార్తల్లో వస్తామన్న తాపత్రయంతోనే ఇదంతా చేస్తున్నారన్నారు.
స్కైరూట్ కంపెనీని తీసుకొచ్చిందే బీఆర్‌ఎస్ అని, కాంగ్రెస్ నేతలు ఇప్పుడా కంపెనీకి రిబ్బన్ కట్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి, రెండున్నర సంవత్సరాలు దాటినా వాటిని కనీసం ప్రస్తావించడం లేదని నిప్పులు చెరిగారు.
గ్యారెంటీ కార్డుల పేరు చెప్పి, ప్రజలందరికీ రంగుల చిత్రం చూపించి మోసం చేశారని దుయ్యబట్టారు. జేమ్స్ బాండ్ల మాదిరి బాండ్ పేపర్లు రాసిన వారిని చూసి ఇప్పుడు జనం నవ్వుతున్నారని తెలిపారు. ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు.
వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం..
తెలంగాణ పైన మళ్లీ కుట్రలు ప్రారంభమయ్యాయని, అన్ని తెలంగాణ వ్యతిరేక శక్తులు మెల్లగా ఏకమవుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని రకాల కుట్రలు పన్నినా, రానున్న శాసనసభ ఎన్నికల్లో తమదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. పార్టీలు మారిన తర్వాత ఏ నాయకుడికి ఉనికి ఉండదని, హుజూర్‌నగర్‌లో పార్టీ మారిన ఓ ఎమ్మెల్యే కనీసం తన సొంత గ్రామంలో కనీసం సర్పంచ్ అభ్యర్థిని కూడా గెలిపించుకోలేని పరిస్థితికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరిన పిల్లుట్ల రఘు గులాబీ కండువా కప్పి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు.
కేసీఆర్ చొరవతోనే ఫ్లోరైడ్‌ను తరిమికొట్టాం..
నల్లగొండ జిల్లాలో ఉన్న ఫ్లోరోసిస్ సమస్యను 60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ చొరవ తీసుకుని మిషన్ భగీరథ అమలు చేశారని, తద్వారా ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టారు. జిల్లా రైతాంగం నీళ్ల కోసం వందల బోర్లు వేసి అష్టకష్టాలు పడే పరిస్థితి నుంచి, కేసీఆర్ వ్యవసాయానికి పుష్కలంగా సాగునీరు అందించారని కొనియాడారు.
యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని చరిత్రలో నిలిచిపోయేలా రూ.1800 కోట్లతో అత్యద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రాలో కరువు కాటకాలతో ఇబ్బంది పడిన జిల్లా, ఇప్పుడు అత్యధిక ధాన్యం పండించే స్థాయికి వచ్చిందని వివరించారు. తమ పాలనలోనే నల్లగొండకు మూడు మెడికల్ కాలేజీలు, మిర్యాలగూడలో రూ.35 వేల కోట్లతో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ వచ్చిందని వెల్లడించారు.
కోదాడలో చివరి మడికి నీరు వస్తుందంటే, అందుకు కారణం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఎత్తిపోతలేనని పేర్కొన్నారు. కేసీఆర్ అప్పులు చేసి, తమ ప్రభుత్వంపై భారం వేశారంటున్న కాంగ్రెస్ నేతలు, కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతి రూపాయితోనే తెలంగాణను అభివృద్ధి చేశారన్న సంగతిని గుర్తించాలని హితవు పలికారు. కేసీఆర్ చేసిన అప్పే తెలంగాణకు పెట్టుబడిగా మారిందని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 3,70,000 కోట్ల రూపాయల అప్పు తీసుకువచ్చిందని, కానీ.. ఇప్పటిదాకా ఒక్క ఇటుక కూడా పేర్చలేదని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టులకు ఇచ్చే కమిషన్లకే ఖర్చు పెట్టారని మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాలుగా సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి మూటలు మోయడం తప్ప చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు.
రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు దాన వీర శూరకర్ణ అని, ఎన్నికల తర్వాత కుంభకర్ణ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ ప్రజల చేతుల్లో సీఎం వీపు చింతపండు అయితదని చెప్పుకొచ్చారు. -వచ్చే ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని, కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే ఎన్నికలంటూ అభివర్ణించారు.






