11 April, 2026 | 12:23 AM

గ్యారెంటీల గారడి

02-12-2024 02:28 AM

6 అబద్ధాలు.. 66 మోసాల కాంగ్రెస్ పాలన

  1. నమ్మి ఓటేసిన ప్రజలకు ఒరిగిందేమీ లేదు 
  2. 100 రోజుల హామీల అమలు ఎక్కడ?
  3. దేవుళ్లపై ఒట్లు పెట్టి జనానికి ధోకా 
  4. బీఆర్‌ఎస్ కాంగ్రెస్ పాలనకు తేడా లేదు
  5. రేవంత్‌రెడ్డితో నిర్మాణాత్మక చర్చకు రెడీ 
  6. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి 
  7. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ చార్జిషీట్

హైదరాబాద్, డిసెంబర్1 (విజయక్రాంతి): ‘తెలంగాణలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’ అనే నినాదంతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకుని అధికా రంలోకి వచ్చి ఏడాది పాలనను పూర్తి చేసుకున్నా ప్రజల జీవితాల్లో మార్పు ఏమీ రాలేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు.

మార్పు సంగతి దేవుడెరుగు.. కాంగ్రె స్ పాలనలో ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైందని ఆవేదన వ్యక్తంచేశారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే విపరీత అపకీర్తిని మూటగ ట్టుకుందని అన్నారు. ‘కాంగ్రెస్ గ్యారెంటీల గారడి.. 6 అబద్ధాలు..

66 మోసాలు’ పేరుతో చార్జిషీట్‌ను ఎంపీ డీకే అరుణ విడుదల చేయగా, కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆదివారం సోమాజిగూడలోని ఓ హోటల్‌లో బీజేపీ ఛార్జిషీట్‌పై కిషన్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై విమర్శ చేసేందుకు రెండు రోజుల సమయం సరిపో దని అన్నారు.

ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని, వాటికి అనుబంధ హామీలు సంవత్సర కాలంలో పూర్తిచేస్తామని సోనియాగాంధీ సంతకంతో ఇంటింటా కరపత్రాలు పంచిన కాంగ్రెస్ పార్టీ.. ఏడాది పాలనలో 66 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా దగా చేసిందని ధ్వజమెత్తారు.

బీఆర్‌ఎస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసి తరిమికొట్టగా.. గద్దెనెక్కిన కాంగ్రెస్ అదే పంథాను కొనసాగిస్తూ ప్రజావ్యతిరేక, అరాచక పాలనతో వేధిస్తోందని మండిపడ్డారు. 

లాఠీఛార్జీలతో అణచివేత 

ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్‌ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను నిలదీస్తే అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలు, నిర్బంధాలతో అణచివేస్తున్నదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘భూసేకరణ పేరుతో రైతుల భూములు గుంజుకుంటోంది. మూసీ ప్రక్షాళన, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చివేస్తోంది.

నియామక పరీక్షలు, ఉద్యోగాల కోసం నిరసన తెలిపిన వారిపై దాడులకు తెగబడుతోంది. రాష్ర్టంలో గురుకులాలు, సర్కారు బడుల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై, నరకకూపాల్లా మారుతుంటే చలనం లేకుండా వ్యవహరిస్తున్నది. తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనను మించిన కష్టాలు గత ఏడాది కాలంగా అనుభవిస్తున్నారు.

అబద్ధపు హామీలు, గ్యారెంటీల గారడీలతో తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు విజయోత్సవాల పేరిట మరిన్ని అబద్ధాల ప్రచారానికి తెరలేపుతోంది’ అంటూ కిషన్‌రెడ్డి విమర్శించారు. హామీలను అమలు చేయలేనప్పుడు తప్పుడు వాగ్దానాలు ఎందుకు చేశారని నిలదీశారు.

రేవంత్ ప్రభుత్వం నియంతృత్వ, అప్రజాస్వామిక, మోసపూరిత పాలనలో గోస పడుతున్న బాధితులకు భరోసానిచ్చేందుకు బీజేపీ భరోసా కల్పించేలా పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు. ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి, ఎన్నికల హామీలను సాధిస్తామన్నారు. డిసెంబరు 7న కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా.. రేవంత్ సర్కారు వైఫల్యాలపై బీజేపీ రాష్ట్ర ప్రజల తరఫున సంధిస్తున్న ఛార్జ్‌షీట్ ఇదని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, నగేశ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎండల లక్ష్మీనారాయణ, నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ఎన్వీ సుభాష్, రాణీరుద్రమ, ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీ ఛార్జీషీట్‌లోని ముఖ్యాంశాలు

రైతన్నల వంచన

* రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నరు. కొందరికే రుణమాఫీ చేశారు. ఏటా రైతుభరోసా కింద రైతులు, కౌలురైతులకు ఎకరానికి ఇస్తామన్న రూ.15 వేలు ఇప్పటివరకు ఇవ్వలేదు. రైతుకూలీలకు రూ.12 వేల సాయం లేనేలేదు. 2024 వానకాలం నుంచే పంటల బీమా పథకం అమలు చేస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. రైతులు పండించిన 10 పంటలకు ఎమ్‌ఎస్పీపై రూ.500 బోనస్ ఇస్తామని సన్న వడ్లకు మాత్రమే పరిమితం చేశారు.

మహిళలకు మోసం

* మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2500 సాయం అందని ద్రాక్షగానే మిగిలింది. 

* పేదింటి ఆడబిడ్డల పెండ్లి సమయంలో ఇచ్చే రూ.లక్షతోపాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం హామీగానే మిగిలింది. 

* పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయంతో కూడిన బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరణ చేయలేదు. 

* కాలేజీ చదువుకునే ప్రతి యువతికి స్కూటీని ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చి మాట తప్పింది.

భూ అక్రమాలపై మెతక వైఖరి

* ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి, అన్ని భూహక్కుల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదు.  

* ధరణి పోర్టల్ రద్దు చేయలేదు. భూమాతను తీసుకురాలేదు.  

* ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీని రద్దు చేస్తామని, సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో రైతుల భూములను మరింతగా గుంజుకుంటూ అన్యాయం చేస్తున్నది.

* నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఇంతవరకు జాడేలేదు.

* సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను గాలికి వదిలేసింది.

ఉద్యోగుల గోసలు, నిరుద్యోగుల వెతలు

* ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను తక్షణమే చెల్లిస్తామని.. అధికారంలోకి వచ్చాక ఒక్క డీఏను మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకొంది. 

* వేతన సవరణలతోపాటు ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే హోంగార్డుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలిపిన హోంగార్డులపై కేసులు బనాయిస్తోంది.

ఓబీసీలు, ఈబీసీలకు వెన్నుపోటు

* కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా బీసీ డిక్లరేషన్ కానీ, సబ్‌ప్లాన్ కానీ అమలు చేయలేదు.

* ప్రమాదశాత్తు చనిపోయే గీత కార్మికులకు రూ.10 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా పెంపు హామీ అతీగతీ లేదు.

* బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామన్న హామీ హామీగానే మిగిలింది. 

* ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు వాగ్దానం ఏడాది గడిచినా నెరవేరలేదు.

ఎస్సీ, ఎస్టీలకు ధోకా

* గిరిజన ప్రాంతాల్లో అర్హులెన రైతులకు పోడు పట్టాలిస్తామని హామీ ఇచ్చి.. అమలులో మాత్రం చేతులెత్తేసింది.

* జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు పెంపుతోపాటు వర్గీకరణ చేసి న్యాయం చేస్తామని మాట తప్పింది.

* అంబేద్కర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయం హామీగానే ఉండిపోయింది. 

* మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉప కులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఏటా ఒక్కో కార్పొరేషన్‌కు రూ.750 కోట్ల నిధులు కేటాయిస్తామని డిక్లరేషన్‌లో చేర్చింది. ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు.

* ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పదో తరగతి పాస్ అయితే రూ.10 వేలు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.25 వేలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ. లక్ష అందజేస్తామని వాగ్ధానం చేసింది. ఇప్పటివరకు ఏ ఒక్కరికీ సాయం అందించలేదు.

చార్జిషీట్ ముఖ్యాంశాలు

* ఏటా రైతుభరోసా కింద రైతు లు, కౌలురైతులకు ఎకరానికి ఇస్తామన్న రూ.15 వేలు ఇప్పటివరకు ఇవ్వలేదు. రైతుకూలీలకు రూ.12 వేల సాయం లేనేలేదు. 

* నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.

* మహాలక్ష్మి ద్వారా మహిళలకు నెలకు 2500 సాయం అందలే. 

* పేదింటి ఆడబిడ్డల పెండ్లి సమయంలో ఇచ్చే రూ.లక్షతోపాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం హామీగానే మిగిలింది. 

* చేయూత కింద వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాం గులకు రూ.౬ వేలు పెన్షన్ల పెంపు అమలుకు నోచుకోలేదు. 

పత్తా లేని పెన్షన్లు

* తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.2,500 నెలవారీ పెన్షన్, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అమలు చేయలేదు. 

* తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి, 250 గజాల ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని మరిచింది.

* సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పినా అడుగు ముందుకు వేయలేదు. * చేయూత కింద వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.౬ వేలు పెన్షన్ల పెంపు హామీ అమలుకు నోచుకోలేదు. 

* ప్రతి ఆటో డ్రెవర్‌కు ఏటా రూ.12 వేల ఆర్థిక సహాయం అందచేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు.

విద్యార్థులకు ధోకా

* గత బీఆర్‌ఎస్ పాలనలో రాష్ర్టంలో గురుకులాలు, సర్కారు బడులు, వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలతో నరకకూపాలుగా మారాయని ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్.. ఇప్పుడు జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై అదే నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది.  

* రాష్ర్టవ్యాప్తంగా 2021 నుంచి విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.6,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించలేదు.

* యువ వికాసం కింద విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు హామీ అమలుకు నోచుకోలేదు

* మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అమలుకాలేదు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.

* మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్ మంజూరులో జాప్యం చేస్తుంది. 900 మందికి రెండో విడత సాయం పెండింగ్. 

వైఫల్యాలకు చిరునామా కాంగ్రెస్ సర్కారు 

* తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం సరఫరా కలగానే మిగిలింది. 

* కాంగ్రెస్ ఏడాది పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా గత బీఆర్‌ఎస్ పాలననే కొనసాగిస్తున్నది.

* బెల్ట్‌షాపులను పూర్తిగా రద్దు చేస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మద్యంనే ఆదాయ వనరుగా చేసుకుని పాలన చేస్తున్నది. 

* సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తామని చెప్పి ఒకే ఒక్కరోజు నిర్వహించారు. అర్జీలను పట్టించుకోలేదు.