calender_icon.png 9 February, 2026 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జానపద సాహిత్య రారాజు

08-02-2026 12:00:00 AM

నేడు బిరుదురాజు రామరాజు వర్ధంతి :

శారీరక శ్రమ, మేధోశ్రమ అనే రెండు సందర్భాలను సాహిత్యంలో ప్రయోగిస్తుంటాం. శారీరక శ్రమ సామాజిక సంపదను సృష్టిస్తుంది. మేధోశ్రమ సమాజ సంస్కారాన్ని ప్రతిబింబిస్తుంది. మేధోరంగంలో విశ్రాంతి లేని శ్రమజీవులు కొందరుంటారు. అలాంటి అరుదైన మేధో శ్రమజీవి ఆచార్య బిరుదురాజు రామరాజు. తెల్ల ధోవతి, లాల్చీ కండువా ధరించి, నుదుటన నిలువు తిలకం బొట్టుతో అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెదనానికి ప్రతీకగా కనిపించే రామరాజు 1925 ఏప్రిల్ 16న హనుమకొండ జిల్లా దేవనూరు గ్రా మంలో లక్ష్మీ దేవమ్మ, నారాయణరాజు దంపతులకు జన్మించారు.

తెలుగు సాహిత్య చరిత్రలో బిరుదురాజు రామరాజు చేసిన కృషి అద్వితీయం. అధ్యయనం, పరిశోధన, అధ్యాపనం అనే మూడు లక్షణాలతో ఆయన జీవిం చారు. తెలంగాణ సమాజంలో చదువుకున్న మొదటితరం వ్యక్తి బిరుదురాజు. ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని అభ్యసించి ఆ రంగంలోనే ప్రత్యేక పరిశోధ న చేసి సాహిత్య విద్యార్థులకు కొత్త చూపును ఇచ్చారు. పరిశోధకులకు లోతైన దృష్టిని అలవాటు చేశారు. ఆయన శైలి గ్రాంధికంలో  ఉండడం వల్ల కొంత పరిమితి ఏర్పడింది.

అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలు గు చదువుతున్న రోజుల్లో రామరాజుకు సాహిత్య అధ్యయనం, పరిశోధన మీద మక్కువ ఏర్పడింది. మొదట పరిశోధనాంశంగా యక్షగాన సాహిత్యాన్ని ఎంచుకోవాలని రామరాజు భావించారు. కానీ తన గురువు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం సూచనతో జానపద సాహిత్యం వైపు మళ్లారు. జానపద సాహిత్యం అచ్చమైన ప ల్లె సంస్కృతికి, ప్రజా జీవనానికి మూలమని భావించిన రామరాజు రవాణా సౌకర్యాలు బొత్తిగా లేని ఆ రోజుల్లో 34 నెలల పాటు కాలి నడకన మైళ్ల కొద్ది ప్రయాణం చేశారు.

అనేక మారుమూల పల్లెల్లో తిరుగుతూ ఎం దరినో కలుసుకుని వారు పాడే పాటలను వి ని రాసుకునేవారు. సుదీర్ఘంగా సాగిన ప్ర యాణంలో కొన్నిసార్లు అనారోగ్యానికి కూ డా గురవ్వడంతో పాటు, తిండికి కూడా ఇబ్బంది పడ్డారు. అలసటతో అలసిపోయిన పట్టువదలని రామరాజు ఎంతో శ్రమతో అజ్ఞాతంలో ఉండిపోయిన పాటలను సేకరించారు. ఆ పాటలను పరిశీలించి, అధ్యయనం చేసి, పరిశోధించి వాటికి సమగ్ర రూపాన్ని ఇచ్చి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో రామరాజు తెలుగు జానపదాన్ని గేయ సాహిత్యంగా అందించి పిహెచ్.డి పట్టా పొందారు. 

రామరాజు కృషి భవిష్యత్తు తరాల వారికి మార్గదర్శకమైంది. రామరాజు అందించిన ఆ జానపద విజ్ఞాన భాండాగారం నేడు ఎంతో మం దికి పరిశోధనాంశం అయ్యింది. జానపద సాహిత్యాన్ని అధ్యయనంచేయాలంటే నిర్దిష్ట లక్షణాలు అవసరం అని గుర్తించిన రామరాజు తన పరిశోధనల ద్వారా లక్షణాలను ప్రతిపాదించారు. 

ఆంధ్రయోగులు, చరిత్రకెక్కని చరితార్థులు, మరుగున పడిన మాణిక్యాలు, తెలంగాణా పిల్లల పాటలు, తెలంగాణా పల్లె పాటలు వీరగాథలు, తెలుగు జానపద రామాయణం మొదలైన ఎన్నో రచనలు చేశారు. 1994 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రామరాజుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అస్వస్థత కారణంగా బిరుదురాజు రామరాజు 2010, ఫిబ్రవరి 8న హైదరాబాదులో మర ణించారు. చివరగా విశ్వవిద్యాలయ స్థాయిలో జానపద సాహిత్యానికి సముచిత స్థానం కల్పించి జానపద సాహిత్య రారాజుగా అందరి మన్ననలు పొందారు.

 ఆచార్య చింతకింది కాశీం

(తెలంగాణ సాహిత్య అకాడమీ పుస్తకం సౌజన్యంతో)