calender_icon.png 9 February, 2026 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుంకాల సంకెళ్లకు చెల్లు

08-02-2026 12:00:00 AM

భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు కావడం శుభపరిణామం. ఈ ఒప్పందం వల్ల మన దేశం నుంచి ఎగుమతులు పెరగడం వల్ల చేతి వృత్తుల ఉత్పత్తులు సహా చాలా రంగాలకు లాభం చేకూరనుంది. ఇక సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం, ఈ ఒప్పందం భారతీయ ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను తెరుస్తుందని కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

ఈ ట్రేడ్‌డీల్ ద్వారా భారత రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పూర్తి రక్షణ కల్పించామని చెప్పడం ముదావహం. దీనివల్ల దేశ రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, విదేశీ ఉత్పత్తులకు ద్వారాలు పూర్తిగా తెరవలేదని భరోసానిచ్చారు. రష్యా వద్ద చమురు కొనుగోలును భారత్ ఆపేసిందని అమెరికా మరోసారి ప్రకటన చేసింది. కానీ ట్రేడ్ డీల్ విషయంలో మాత్రమే స్పందించిన భారత్ రష్యాతో వ్యాపారం విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కానీ ఈ ఒప్పందం వల్ల అమెరికన్ రైతులకు సాయం చేకూరేలా వారి దిగుమతులపై భారత్ సుంకాలు తగ్గించనుండడం వాణిజ్యంతో పాటు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. అమెరికా దిగుమతులు మూడు రెట్లు పెరిగిపోవడం వల్ల మన వాణిజ్య మిగులు తుడిచిపెట్టుకుపోయే ప్రమాద ముంది. అందుకే అమెరికాతో  వాణిజ్య ఒప్పందం అంటే ఏదో మూలన అనుమానం రాక మానదు. ఎందుకంటే ప్రతిఫలం ఆశించినదే అమెరికా అంత సులువుగా ఎవరితో ఒప్పందానికి ముందుకు రాదు.

ఈ నేపథ్యంలో తాజా ఒప్పందం వెనుక ఏవైనా లోపాయికారి ప్రయోజనాలు ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ ఒప్పందం అమలు మాత్రం అమెరికాకు అనుకూలంగా ఉండకపోవచ్చని చెప్పగలం. మన ఆర్థికశక్తి, రాజకీ యాలు, ఇతర విధానాలు బేరీజు వేసుకొని చూస్తే ఈ స్థితిలో అమెరికా మన్నల్ని విస్మరించగలిగే సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన జాబితాలో ఆసియా నుంచి చైనా, భారత్, జపాన్‌లు ఉన్నాయి.

ఈ మూడు ఆసియా దేశాల ఆర్థిక జైత్రయాత్రను అడ్డుకోవడమే ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడున్న స్థితిలో అది సాధ్యమయ్యేదిగా కనిపించడం లేదు. ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను ఎన్నోసార్లు హేళన చేస్తూ మాట్లాడినప్పటికీ చివరికి వాణిజ్య ఒప్పందానికి అంగీకరించక తప్పలేదు. ట్రంప్ వికృత చర్యలతో ఈయూ సహా చాలా దేశాలు భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ముందుకు రావడం కూడా అమెరికాను కుదురుగా ఉండనివ్వలేదు.

ప్రపంచంలో తమ తర్వాత బలమైన ఆర్థిక శక్తులుగా కొనసాగుతున్న చైనా, భారత్‌లను కాదని వ్యవహారాలను నెట్టుకురావడం అమెరికాకు కష్టతరమైపోయింది. అటు యూరప్ పరిస్థితి కూడా అంతే. భారత్ యూనియన్ (ఈయూ) మ ధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందమే ఇందుకు నిదర్శనం. అయితే యూరప్‌తో, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదిరినంత మాత్రాన భారత్ ముందున్న సవాళ్ల తీవ్రత తగ్గిపోదు.

వాణిజ్య ఒప్పందాలతో లభించే ఉపశమనాలతో ఉప్పొంగిపోయే పరిస్థితి లేదు. వస్తు తయారీ, విద్య, ఆరోగ్యం, కృత్రిమ మేధస్సు, పర్యావరణ పరిరక్షణలో చైనాతో పోలిస్తే భారత్ కాస్త వెనుకబడే ఉంది. వీటిలో పురోగతి సాధించినప్పుడే భారత్ తాను కలగంటున్న వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకుంటుందని చెప్పొచ్చు.