కృష్ణమ్మ ఉగ్రరూపం.. మొసళ్ల సంచారం!
నది తీర ప్రాంత ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి
ఎర్రవల్లి, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో బీచుపల్లి వద్ద కృష్ణానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో ఎగువ ప్రాంతాల నుంచి మొసళ్లు నదిలోకి కొట్టుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో నది తీర ప్రాంత ప్రజలు, పర్యాటకులు, భక్తులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు సూచించారు. స్నానాలు, పూజల కోసం నదిలోకి దిగరాదని, మత్స్యకారులు వేటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. నది ప్రవాహం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు అలంపూర్ సీఐ ప్రదీప్, ఇటిక్యాల ఎస్‌ఐ రవి, ఎంఆర్‌ఓ నరేష్, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి అరుణ ప్రజలకు భద్రతా సూచనలు జారీ చేశారు.






