calender_icon.png 16 December, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

50% పరిమితిని ఎత్తివేయాల్సిందే

16-12-2025 02:04:33 AM

  1. మా వాటా మాకు దక్కేదాకా పోరాడుతాం
  2.   42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రానికి నాన్చుడు ధోరణి
  3. ఆమోదం తెలిపి బీసీలపై ప్రధాని చిత్తశుద్ధి నిరూపించుకోవాలి 
  4. ఢిల్లీ బీసీల మహాధర్నాలో అఖిలపక్ష నేతల డిమాండ్

ఢిల్లీ, డిసెంబర్ 15 (విజయక్రాంతి): దేశంలో రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసి, జనాభా దామాష ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని లేదంటే దేశంలో సామాజిక తిరుగుబాటు తప్పదని అఖిలపక్ష నేతలు, బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఇచ్చిన చలో ఢిల్లీ పిలుపు మేరకు సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యం లో బీసీల మహాధర్నా నిర్వహించారు. 

వెనుకడుగు వేయం: మహేశ్‌కుమార్‌గౌడ్

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ వెనుకడుగు వేయదని, స్థానిక పరిస్థితుల దృష్ట్యా గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించామే తప్ప, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ నుంచి కాంగ్రెస్ వైదొలగలేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో ఇప్పటికే చర్చించామని, అతి త్వరలోనే కేంద్రంపై పోరాటానికి రాజకీయ కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా బీజేపీ అడుగడుగునా అడ్డుపడుతున్నదని, రాజ్యాంగబద్ధ సంస్థలను తమ చేతిలో పెట్టుకుని బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్రలు చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దెబ్బకు దిగి వస్తుందని అభిప్రాయపడ్డారు. 

అఖిలపక్షంతో ప్రధానిని కలవాలి

మాజీ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లా డుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నదని, రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టినా, చట్టం చేసినా బీఆర్‌ఎస్ అండగా నిలబడిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ చిత్తశుద్ధితో ప్రయత్నించకుండా వ్యహరిస్తుందని వారు ఆరోపించా రు.

సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వచ్చి ప్రధాని కలవాలని డిమాండ్ చేసినా వినడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పార్లమెంటులో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీసీ బిల్లు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే బీఆర్‌ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. 

రాహుల్‌గాంధీపై ఒత్తిడి తెస్తాం: వీహెచ్

వి హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రధానిగా బీసీ నరేంద్ర మోదీ ఉన్నప్పటికీ బీసీలకు న్యాయం జరగకపోవడం దురదృష్టకరమన్నారు. పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లపై ప్రైవేటు బిల్లు పెట్టేలా రాహుల్‌గాంధీపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. బీసీ బిల్లుపై పార్లమెంటులో కొట్లాడుతున్నా బీజేపీ స్పందించడం లేదన్నారకు. కాగా మల్లురవి మాట్లాడుతుండగా బీసీ సంఘాల నేతలు అఖిలపక్షంతో సీఎం ఢిల్లీకి ఎందుకు రావడం లేదని పార్లమెంటులో రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ఉపన్యాసానికి అడ్డు తగిలారు. 

గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం: జాజుల

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల ఉద్యమా న్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉధృతం చేస్తున్నా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్పందించకుండా అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికీ రెండు సార్లు రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టినా అఖిలపక్షంతో ఎందుకు ప్రధా నిని కలవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ బీసీలకు బద్ద శత్రువుగా మా రిందని, నాటి మండల్ నుంచి నేటి బీసీ రిజర్వేషన్ల వరకు బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని విమర్శించా రు.

బీసీ రిజర్వేషన్లు అమలు చేయని బీజేపీని, ఒత్తిడి పెంచని కాంగ్రెస్ పార్టీలను బీసీలు విశ్వసించరని, వారికి తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో రాపోలు ఆనంద భాస్కర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్‌రావు, మహారాష్ట్ర అధ్యక్షుడు సచిన్ రాజోలుకర్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, మహిళా సంఘం అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, పెరిక సురేష్, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, కే వీరస్వామి, పిట్ల శ్రీధర్, కౌల జగన్నాథం, నాగ మల్లేశ్వరరావు, నందగోపాల్, జాజుల లింగం గౌడ్ పాల్గొన్నారు.