19-01-2026 12:00:00 AM
సిరికొండ జనవరి 18 (విజయ క్రాంతి) : నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలంలో మాఘమాసం అమావాస్య సందర్భంగా లొంక రామలింగేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. దట్టమైన అడవుల నడుమ, సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి మారుమూల గ్రామాలు, వివిధ మండలాలు, జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనార్థం భక్తులు కాలినడకన అడవిమార్గాలను దాటుకుంటూ క్షేత్రానికి చేరుకున్నారు. ఎక్కడ చూసినా ఓం నమః శివాయ నామస్మర ణతో, భక్తిగీతాలతో పరిసరాలు మార్మోగాయి. కోనేట్లో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు బారులు తీరారు.
ఈ సందర్భంగా సిరికొండ ఎస్.ఐ రామకృష్ణ, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆర్.సి. రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నాసత్రంలో భక్తులు ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా నాగరాజు పంతులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, ఆలయ కమిటీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, అన్నదానం, దర్శన ఏర్పాట్లు సక్రమంగా చేపట్టింది.