27 May, 2026 | 12:49 AM

ముంచుకొస్తున్న కరువు!

27-05-2026 12:00 AM

భారత్‌లో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో నిత్యం భిన్నమైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు ఎండలు మండుతుండగా, మరోవైపు అకాల వర్షాలు కురుస్తుండటం ఏ మాత్రం ఆశ్యర్య కలిగించడం లేదు. ఇప్పటికే ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో మంచు కురవడం, ఉత్తరప్రదేశ్‌లో గాలిదుమారం చెలరేగడం అనుభవంలో ఉన్నది. భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి భిన్నమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి.

అయితే, తెలంగాణలోని నల్లగొండ, వికారాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో సోమవారం మధ్యాహ్నం వరకు ఎండలు ఠారె త్తించగా, సాయంత్రం అకాల వర్షం కురవడం గమనార్హం. ఈ అకాల వర్షాల మూలంగా కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి అన్నదాతలు తీవ్రం గా నష్టపోవడం బాధాకరం. కాగా, ఈనెల 26న కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఎల్‌నినో ప్రభావంతో మరింత ఆలస్యమవడం ఆందోళన కలిగిస్తున్నది.

రుతుపవనాల ఆలస్యం కారణంగా ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడం కలవరపరుస్తున్నది. మనది వ్యవసాయ ఆధారిత దేశం అన్న సంగతి తెలిసిందే. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే ఇప్పటికీ వెన్నెముకగా నిలుస్తున్నది. దేశ జీడీపీలో 18 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం సుమారు 45 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఎల్‌నినో ప్రభావంతో తరుముకొస్తున్న కరువు వ్యవసాయ రంగంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను ముంచెత్తే ప్రమాదం లేకపోలేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పండక ఆహార సంక్షోభం తలెత్తే ముప్పు పొంచి ఉన్నది.

ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ప్రస్తుత పరిస్థితులు నొక్కిచెప్తున్నాయి. కరువును తరిమికొట్టేందుకు ప్రతి వర్షపు నీటిబొట్టును ఒడిసిపడుతూ నీటిసంరక్షణ చర్యలను చేపట్టాలి. కొత్తగా చిన్న చిన్న ప్రాజెక్టులు, బండ్‌ల నిర్మాణంతోపాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న నీటివనరులకు మరమ్మతులు చేయాల్సిన తరుణమిది. అదే సమయంలో ఉపాధిహామీ లాంటి పథకాలకు విరివిగా నిధులు కేటాయించి వ్యవసాయరంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు, రైతుకూలీలను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే, ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి కరువు నివారణ దిశగా ముందస్తు చర్యలు కనిపించకపోవడం శోచనీయం.