ప్రయోగాత్మక పాఠం జీవనవేదం
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో విద్యావిధానం చాలా యాంత్రికంగా సాగుతున్నది. ఏదో క్లాసుకు వెళ్లామంటే వెళ్లాం.. పాఠాలు చెప్పాం అంటే చెప్పాం అన్నట్లుగా ఉపాధ్యాయుల బోధన నడుస్తున్నది. పిల్లల్లో సృజనాత్మకతను, కొత్త ఆలోచనలను పెంపొందించే ప్రయోగాత్మక విద్యా విధానం భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రయోగాత్మాక విద్యపై శీతకన్నే. ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు చదువుపై ఇష్టం కలిగించడంలో విద్యాశాఖ విఫలం అవుతున్నది.
నిజానికి చదువుకోవడమనేది పిల్లలకు భారం కాకూడదు. వారు ఇష్టంగా చదువుకుంటేనే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయి. అప్పుడే వారి మేధో వికాసం సాధ్యం అవుతుంది. పిల్లల మానసిక స్థాయిని బట్టి మన విద్యా విధానం ఉం డాలని అంతర్జాతీయ పిల్లల మానసిక వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త జీన్ పియాజె తన కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ థియరీ (సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం)లో ఒక ముఖ్యమైన విష యం చెప్పారు.
పిల్లలు చిన్న వయసులో వస్తువులను తాకడం, చూడడం, ప్రత్యక్ష అనుభవాల ద్వారా మాత్రమే కొత్త విషయాలను నేర్చుకుంటారని తెలిపారు. అందుకే వారిపై పుస్తకాల భారం పెట్టకుండా, ఉపాధ్యాయులు ఆటపాటల ద్వారా పాఠాలు చెప్పాలి. మరో ప్రముఖ విద్యావేత్త మరియా మాంటిస్సోరి కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. పిల్లలకు స్వేచ్ఛా పూరిత వాతావరణంలో ప్రయోగాత్మక విద్యను అందించినప్పుడే వారి ఆలోచనా శక్తి పెరుగుతుందని, శాస్త్రీయంగానూ ఆ ప్రయోగా లు విజయవంతమయ్యాయని తెలిపారు.
విదేశాల్లో అప్లైడ్ సైకాలజీ సక్సెస్
అంతర్జాతీయంగా చూస్తే ఫిన్లాండ్, జపా న్, సింగపూర్ వంటి దేశాలు ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్థాయిలో ఈ ప్రయోగాత్మక విద్య ను, అప్లైడ్ సైకాలజీని అద్భుతంగా అమలు చేస్తున్నాయి. ఈ దేశాలు పాతకాలపు బట్టీ పద్ధతులకు పూర్తిగా స్వస్తి పలికి పిల్లల మానసిక స్థాయికి తగ్గట్లుగా పాఠ్యాంశాలు రూపొందించాయి. ముఖ్యంగా ఫిన్లాండ్ దేశంలో ఏడేళ్ల వయసు వచ్చే వరకు పిల్లలకు ఎలాంటి పరీక్షలు ఉండవు. కేవలం ఆటపాటలు, చేతివృత్తులు, ప్రకృతిని గమనించడం ద్వారానే ఉపాధ్యాయులు ప్రాథ మిక జ్ఞానాన్ని అందిస్తారు. జపాన్‌లో ప్రాథమిక స్థాయిలో కేవలం అక్షరాలు నేర్పడం మాత్రమే కాకుండా, పిల్లలకు నైతిక విలువ లు, సామాజిక బాధ్యతలను అనుభవపూర్వకంగా నేర్పుతారు.
సింగపూర్ విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్ (విమర్శనాత్మక ఆలోచనా ధోరణి) పెంపొందించేందుకు ఉపాధ్యాయు లు అప్లైడ్ సైకాలజీ సూత్రాలను బోధిస్తారు. ఈ వినూత్న విద్యా విధానాల వల్లే ఆయా దేశాలు గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇండెక్స్ టాప్ రేంజ్‌లో ఉన్నాయి. అక్కడ చదువుకునే పిల్ల ల్లో మానసిక ఒత్తిడి లేకపోవడం వల్ల సులువుగా చదువుకుంటున్నారని, చాలా చిన్న వయస్సులోనే మేధావులుగా ఎదుగుతున్నారని అంతర్జాతీయ గణాంకాలు వెల్లడిస్తు న్నాయి. ఆయా దేశాల్లో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే సామర్థ్యం పిల్లల్లో చిన్న వయసు నుంచే పెరుగుతున్నది. ఈ ప్రయోగాత్మక పునాది వారి భవిష్యత్తు ఉన్నత విద్యకు ఎంతో దోహద పడుతున్నది.
జాతీయ విద్యావిధానం ఇలా..
భారతదేశంలో ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ విద్యావిధానం మెల్లమెల్లగా రూపాంతరం చెందు తున్నది. కేంద్ర ప్రభుత్వం మూడు నుంచి ఎనిమిది సంవత్సరాలలోపు పిల్లల కోసం 5+3+3+4 పద్ధతిలో ‘ఫౌండేషనల్ స్టేజ్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తున్నది. దేశంలోని పలు రాష్ట్రాలు వినూత్నమైన ప్రయోగాత్మక విద్యా విధానాలను అమలు చేస్తూ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నా యి.
ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘హ్యాపీనెస్ కరికులం’, ‘మిషన్ బునియాద్’ వంటి ప్రయోగాలు విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలను ఎంతో మెరుగుపరిచాయి. తమిళ నాడు ప్రభుత్వం ‘ఇల్లం తేడి కల్వి’ (ఇంటి వద్దకే విద్య), ‘ఎన్నుమ్ ఎళుత్తుమ్’ పథకాల ద్వారా ప్రాథమిక స్థాయి పిల్లల్లో అక్షరాస్యతను, గణిత నైపుణ్యాలను పెంచడంలో పెద్ద విజయం సాధించింది. కర్ణాటక, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా ఆటపాటల ఆధారిత అభ్యాస విధానాలను, డిజిటల్ తరగతుల ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాయి.
కేరళంలో మెరుగైన విధానాలు
దేశంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన కేరళ రాష్ర్టం ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ విద్యలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. కేరళం ప్రభుత్వం ‘కలితోని’ (కథలు, ఆటల పుస్తకం) వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తోంది. అక్కడ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అంతర్జాతీ య ప్రమాణాలతో కూడిన హైటెక్ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూస్తాయి. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందే లా చూస్తాయి. ఉపాధ్యాయులకు నిరంతరం ఆధునిక బోధనా పద్ధతులలో శిక్షణ ఇస్తాయి. కేరళం ప్రాథమిక విద్యావిధానం కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాలేదు. అందుకే ఆ రాష్ట్ర విద్యావిధానం అంత ప్రత్యేకం.
మూస పద్ధతిలో బోధన బోర్
సాధారణ బోధనకు, ప్రయోగాత్మక బోధనకు మధ్య చాలా పెద్ద తేడా ఉంటుం ది. మామూలు పద్ధతిలో టీచర్ బ్లాక్ బోర్డు మీద రాస్తూ చెప్తుంటారు. విద్యార్థులు ఆ పాఠాలను కేవలం వింటూ బట్టీ పడతారు. ఇది పిల్లల్లో బద్ధకాన్ని, విసుగును పెంచుతుంది. అదే ప్రయోగాత్మక బోధనలో పిల్ల లు స్వయంగా భాగస్వాములవుతారు. ఇక్కడ నేర్చుకోవడమనేది ఒక సజీవ ప్రక్రియగా రూపాంతరం చెందుతుంది. అందు కే మొదటి విధానం కంటే రెండో విధానం పిల్లల మనసుకు చాలా వేగంగా చేరువవుతుంది. కంటితో చూసి, చేతితో చేసిన విష యాలు వారి మెదడులో బలంగా నాటుకుపోతాయి. దీనికి ఒక చక్కని ఉదాహరణ చెప్పుకోవచ్చు.
సాధారణ పద్ధతిలో ఒక టీచ ర్ ‘మొక్కల భాగాలు’ అనే పాఠాన్ని బోర్డు మీద బొమ్మ గీసి వివరిస్తారు. అదే ప్రయోగాత్మక పద్ధతిలో బోధించే ఉపాధ్యాయుడైతే పిల్లలను నేరుగా స్కూల్ తోట లోకి తీసుకెళ్తారు. ఒక చిన్న మొక్కను వేర్ల తో సహా చూపిస్తూ వివరిస్తారు. వేర్లు ఎలా ఉంటాయి, ఆకులు ఎలా ఉంటాయో స్వయంగా పిల్లల చేతులతో తాకించి చూపిస్తారు. అప్లైడ్ సైకాలజీ ప్రకారం.. ఈ స్పర్శ, ప్రత్యక్ష అనుభవం పిల్లల జ్ఞాపకశక్తి ఐదు రెట్లు పెరు గుతుంది. అలాగే కూడికలు, తీసివేతలను బోర్డు మీద కాకుండా రంగురాళ్లు, గింజల ద్వారా ఆడిస్తూ నేర్పిస్తే, పిల్లలు సులభంగా గణితం నేర్చుకునే అవకాశం ఉంటుంది.
సృజనాత్మకతకు బాటలు వేయాలి
చిన్నారుల విద్యావికాసానికి ‘అప్లైడ్ సైకాలజీ’ ఎంతో సాయం చేస్తుంది. పిల్లల ప్రవర్తనను, వారి మానసిక అవసరాలను అర్థం చేసుకోవడానికి ఈ శాస్త్రీయ పద్ధతి ఉపయోగపడుతుంది. తరగతి గదిలో అం దరి బాలల మానసిక స్థితి ఒకేలా ఉండదు. కొందరు త్వరగా నేర్చుకుంటారు, మరికొందరిపై ప్రత్యేక శ్రద్ధ అవసరమవుతుంది. అప్లైడ్ సైకాలజీ ద్వారా టీచర్లు పిల్లల బలహీనతలను గుర్తించవచ్చు. వారిలో దాగి ఉన్న ప్రజ్ఞను బయటకు తీయవచ్చు.
భయం లేని వాతావరణం ఉన్నప్పుడే విద్యార్థులు చదువును సులభంగా నేర్చుకుంటారు. పిల్లల జీవితాల్లో విద్య వెలుగులు నింపడానికి ఈ మనస్తత్వ శాస్త్ర సూత్రాలు ఎంతగానో తోడ్పడతాయి. కేవలం బట్టీ పద్ధతులకు గుడ్ బై చెప్పి ప్రయోగాల ద్వారా నేర్పించాలి. అప్పుడే వారిలో క్రియేటివిటీ, లీడర్షిప్ లక్షణాలు పెరుగుతాయి. ప్రభుత్వం ఇప్పటికైనా తన ఉదాసీనతను వీడాలి. వచ్చే విద్యాసంవత్సరం నుంచైనా ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ వ్యవస్థను శాస్త్రీయంగా బలోపేతం చేయాలి. టీచర్లకు మోడరన్ సైకాలజీ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే, నాణ్యమైన ప్రాథమిక విద్యే రేపటి సమాజానికి బలమైన పునాది.






