మహాలక్ష్మి పథకాన్ని వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేయాలి
రఘనాథపాలెం /ఖమ్మం, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలంగాణ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఎడబ్ల్యూ అనుబంధం) జిల్లా కార్యదర్శి ఏపూరి లతాదేవి డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ. 2,500 వారి వారి ఖాతాల్లో జమ చేయాలని, తులం బంగారాన్ని కళ్యాణానికి అందించాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలంగాణ మహిళా సమాఖ్య -విస్తృత స్థాయి సమావేశం బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగింది. జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి అధ్యక్షతన -జరిగిన సభలో ఏపూరి లతాదేవి మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన హామీలలో ఉచిత బస్సు తప్ప దేనిని అమలు చేయలేదని అది కూడా ప్రయాణం ఒక ప్రహసంగా మారిందన్నారు. ప్రయాణికులకు తగిన రీతిలో బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని లతాదేవి తెలిపారు.
మహిళా చట్టాల అమలులో బిజెపి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. రోజు రోజుకు మహిళలపై దాడులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన -విబి జీ రాం జీ పథకంలో మార్పుల కారణంగా గ్రామీణ ప్రాంత మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విబి జీ రాం జీ పథకంలో రెండు సార్లు ఫోటో పద్ధతిని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంటు స్థానాల పునర్ వ్యవస్థీకరణలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను నిర్ణయించాలని ఇందుకు సంబంధించి బిల్ పాస్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
మహిళా సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం పోరాట కార్యాచరణ రూపొందించుకునే క్రమంలో మే ఐదున కొణిజర్లలో మహిళా సమాఖ్య జిల్లా మహాసభను నిర్వహిస్తున్నట్లు లతాదేవి తెలిపారు. ఈ సమావేశంలో తాటి నిర్మల, మహిళా సమాఖ్య -ఇంచార్జి దొండపాటి రమేష్, నాయకులు సిహెచ్ సీతామహాలక్ష్మి, మందడపు రాణి, కె. విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.




