పోటు రంగారావుపై ఉపా కేసు
- నోటీస్ జారీచేసిన జాతీయ దర్యాప్తు సంస్థ
- స్వగ్రామం సూర్యాపేట జిల్లా రంగాపురంలో నోటీసులు అందజేత
- 22న విచారణకు హాజరుకావాలన్న ఎన్‌ఐఏ
సూర్యాపేట/ఖమ్మం/గరిడేపల్లి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుపై దేశ సమగ్రతకు భంగం కలిగించే చట్టవిరుద్ధమైన, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఉపాచట్టం కేసులు ఉన్నాయని కావున ఆయనను విచారణకు హాజరు కావాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నోటీసు జారీ చేసింది.
సీఆర్‌పీసీలోని 160 సెక్షన్ కింద నోటీస్ జారీ చేశారు. గత నవంబర్ 26న హైదరాబాద్ జాతీయ దర్యాప్తు సంస్థ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, దాని ప్రకారం బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 152, యూఏ(పీ) యాక్ట్‌లోని సెక్షన్ 13, 39 కింద కేసు నమోదైనట్లు నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 22న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. అయితే ఈ నెల 15 నాటికి విచారణ స్థలాన్ని తానే ఎంపిక చేసికుని ఉన్నతా ధికారికి సమాచారం అందించాలని తెలిపింది.
అయితే నోటీస్ ఇచ్చేందుకు రంగాపురానికి రాగా ప్రస్తుతం ఆయన ఖమ్మం పట్టణంలో ఉంటున్నారని అతని బంధువులు చెప్పినట్లు తెలిసింది. ఆయన ఆధార్‌కార్డు చిరు నామా ఇక్కడే ఉండడంతో నోటీసు ఇక్కడే ఇచ్చినట్లు తెలిసింది. కాగా రంగారావు మొదట సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో పనిచేస్తూ పార్టీలో విభేదాల కారణంగా కొంతకాలం క్రితం మాస్‌లైన్ అనే పార్టీని స్థాపిం చి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు.




