15 August, 2026 | 2:58 AM

స్ఫూర్తి మంత్రం వందేమాతరం

15-08-2026 02:05 AM

వందే మాతరం

వందేమాతరం

సుజలాం సుఫలాం మలయజ శీతలాం

సస్య శ్యామలాం మాతరం  ॥ వందే ॥


శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం

ఫుల్లకుసుమిత ద్రుమదల శోభినీం

సుహాసినీం సుమధుర భాషిణీం

సుఖదాం వరదాం మాతరం ॥ వందే ॥


కోటికోటి కంఠ కలకల నినాదకరాళే

కోటి కోటి భుజైర్ ధృత కర కరవాలే

అబలా కేయనో మా ఏతో బలే

బహుబల ధారిణీం నమామి తారిణీం

రిపుదలవారిణీం మాతరామ్ ॥ వందే ॥


తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి 

మర్మ త్వమ్ హి ప్రాణాః శరీరే

బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి 

మా భక్తితో మారయి ప్రతిమా గడి

మందిరే మందిరే  ॥ వందే॥


త్వమ్ హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ

కమలా కమలదళ విహారిణీ

వాణీ విద్యాదాయిని నమామి త్వాం

నమామి కమలాం అమలాం అతులాం

సుజలాం సుఫలాం మాతరమ్  ॥ వందే ॥


శ్యామలాం సరలాం సుస్మితాం భూషితాం

ధరణీం భరణీం మాతరం

వందే మాతరం

వందేమాతరం

  1. ఆసేతు హిమాచలం గర్వించదగిన గీతం
  2. స్వతంత్ర సమరంలో పోరాట యోధుల తారకమంత్రం
  3. భరతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు దోహదపడిన దావానలం
  4. బంకిం చంద్ర ఛటర్జీ విరచితం.. విశ్వకవి రవీంద్రుని స్వరకల్పన
  5. గీతానికి తాజాగా చట్టబద్ధత.. నేడు ఎర్రకోటపై అధికారికంగా గీతాలపన

న్యూఢిల్లీ, ఆగస్టు ౧౪: భారతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు స్వతంత్ర పోరాటయోధుల స్ఫూర్తి మంత్రం వందేమాతర గీతం. స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది నరనరాల్లో నింపిన గీతమిది. ఈ గీయం కేవలం కొన్ని పదాల సమాహారం కాదు.. యావత్ దేశాన్నే భావోద్వేగానికి గురిచేసే గీతం. వందేమాతర గీతం వింటేనే చాలు ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. పరాయి పాలనలో నలిగిపోతున్న జాతికి ఆత్మగౌరవాన్ని, పోరాట పటిమను నూరిపోసిన దివ్య మంత్రమిది.

వందేమాతర గీతాన్ని ప్రఖ్యాత బెంగాలీ రచయిత, కవి బంకించంద్ర ఛటర్జీ 1870లో రాశారు. ప్రకృతి సౌందర్యాన్ని, మాతృభూమి ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ కవి సంస్కృతం, బెంగాలీ పదాల సమ్మేళనంతో గీతాన్ని మలిచారు. 1882వ సంవత్సరంలో ఆయన ప్రసిద్ధ నవల ‘ఆనందమఠ్’లో ఈ గీతాన్ని చేర్చారు. నవలలోని మొదటి భాగం, మూడో అధ్యాయంలో ఈ గీతం కనిపిస్తుంది. నవల సాంతం సన్యాసుల తిరుగుబాటు చుట్టూ ఉంటుంది. అలాగే, వారికి మాతృభూమి పట్ల ఉన్న భక్తిశ్రద్ధలు గీతంలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. గీతం వెలుగులోకి వచ్చి ఇప్పటికి 150 ఏళ్లు దాటింది. 

బ్రిటిష్ కాలంలో నిషేధం

స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఆంగ్లేయులు గీతాలపనపై నిషేధం విధించారు. పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాల్లో.. ఎక్కడైనా వందేమాతరం ఆలపిస్తే జైలు శిక్షలు విధించేవారు. అయినా సరే ఆ నిషేధాన్ని ఉల్లంఘించడమే పెద్ద దేశభక్తి పోరాటంగా పరిణమించింది. భగత్‌సింగ్, రాజగురు, సుఖ్‌దేవ్ వంటి విప్లవ వీరులు ఉరికంభం ఎక్కే సమయంలోనూ వందేమాతరం గీతాన్నే ఆలపించారు. వీర సావర్కర్, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి నాయకులు ఈ గీతాన్నే తమ పోరాట గీతంగా మలచుకున్నారు.

అంతర్జాతీయ వేదికలపై కూడా గీతం భారత ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. విదేశాల్లో మేడం భికాజీ కామా ఎగురవేసిన భారత తొలి స్వతంత్ర పతాకంపై కూడా వందేమాతరమనే అక్షరాలే కనిపించాయి. 1907లో జర్మనీలోని స్టుట్‌గార్ట్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సదస్సులో ఆమె ఈ జెండాను ఆవిష్కరించారు. పతాకం మధ్యలో దేవనాగరి లిపిలో వందేమాతరం అని రాసి ఉంటుంది. ప్రపంచ దేశాల ముందు భారత స్వాతంత్య్ర కాంక్షను చాటిచెప్పడంలో గీతం వహించిన పాత్ర వర్ణనాతీతం.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత జాతీయ గీతం ఎంపికపై రాజ్యాంగ సభలో విస్తృత చర్చ జరిగింది. సభ్యులు జాతీయ సమైక్యత, వివిధ ప్రాంతాల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకున్నారు. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. ‘జనగణమన’ను భారత జాతీయ గేయంగా స్వీకరిస్తూనే, ‘వందేమాతరం’ గీతానికి కూడా దానితో సమానమైన గౌరవం, హోదా ఉంటాయని స్పష్టం చేశారు. తద్వారా వందేమాతరానికి జాతీయ గీతం అనే హోదా లభించింది. నాటి నుంచి ప్రభుత్వ, అధికారిక వేడుకల్లో ఈ గేయం, గీతాలపన తప్పనిసరి అయింది.

ఎట్టకేలకు చట్టబద్ధత

‘జన గణ మన’ గేయానికి ఉన్నట్లే వందేమాతరం గీతానికి కూడా సంపూర్ణ చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ దశాబ్దాల నుంచి ఉంది. ఆ దిశగా గతంలో పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. చట్టసభల్లో రాజ్యాంగ నిబంధనలు, పౌరుల ప్రాథమిక విధులను ప్రస్తావిస్తూ తీర్మానాలు కూడా రూపుదిద్దుకున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ప్రకారం జాతీయ చిహ్నాలు, గీతాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత.

జాతీయ గేయాన్ని గౌరవించినట్టే, జాతీయ గీతాన్నీ గౌరవించాలని, దానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ విధంగా వందేమాతర గీత గౌరవాన్ని కాపాడేందుకు చట్టపరమైన పునాదులు బలపడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వందేమాతరానికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా బలమైన అడుగులు వేసింది. జాతీయ జెండా, జాతీయ గీతాల తరహాలోనే వందేమాతరానికి స్పష్టమైన గౌరవ చట్టం ఉండాలని భావించింది. దీనిపై వివిధ ఉన్నత న్యాయస్థానాల్లో సైతం పిటిషన్లు దాఖలయ్యాయి. ‘జనగణమన’తోపాటు వందేమాతరానికీ రెండింటికీ సమానమైన గౌరవం, చట్టబద్ధత కల్పించాలని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది.

ఇటీవల ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్ (సవరణ) బిల్లు -2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. తద్వారా వందేమాతర గీతానికి చట్టబద్ధత వచ్చింది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో గీతాలపన తప్పనిసరి అనే నిబంధనలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ దిశగా పార్లమెంట్ సభలలో నియమ నిబంధనల రూపకల్పన ప్రక్రియ వేగవంతమైంది. తాజాగా పార్లమెంట్ వేదికగా ఒక అపూర్వమైన ఘట్టం ఆవిష్కతమైంది. పార్లమెంట్‌లో మొట్టమొదటిసారిగా సభ్యులంతా వందేమాతర గీతాన్ని సగౌరవంగా ఆలపించారు. దేశ అత్యున్నత చట్టసభలో గీతాలపన యావత్ దేశపౌరులను భావోద్వేగానికి గురిచేసింది.

కొత్త మార్గదర్శకాలు

కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజాగా వందేమాతర గీతాపనపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఇకపై నిర్వహించే ఏ అధికారిక వేడుకల్లోనైనా వందేమాతరం, జనగణమన ఆలపించాల్సిందే. ఆలాపన సమయంలో సభలో ఉన్న వారంతా నిలబడే ఉండాలి. 

విశ్వకవి రవీంద్రుని నోట

అమర గీతానికి అద్భుతమైన స్వరకల్పన చేసి మొదట ఆలపించినవారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన 1896లో కలకత్తా (ఇప్పటి కోల్‌కతా)లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గీతాన్ని తొలిసారిగా ఆలపించా రు. ఆ వేదికపై ఠాగూర్ గొంతు నుంచి జాలుజారిన గతం సభికులను పరవశింపజేసింది. అది మొదలు గీతం దావానలంలా ప్రజాబాహుళ్యంలోకి వెళ్లింది. చివరకు పరిస్థితి ఎలా అయిందంటే, స్వతంత్ర పోరాటంలో భాగంగా జరిగే ప్రతి సభలోనూ, ప్రదర్శనలోనూ గీతాలపన తప్పనిసరి అయిపోయింది.

ప్రజల్లో దేశభక్తి జ్వాలలను రగిలించడంలో గీతం అద్భుతమైన పాత్ర పోషించింది. ముఖ్యంగా 1905 నాటి బెంగాల్ విభజన సమయంలో స్వదేశీ ఉద్యమానికి గీతం ఊపిరూలుదింది. వైస్రాయ్ కర్జన్ బెంగాల్‌ను విభజించినప్పుడు అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి వందేమాతర గీతాలపన చేయ డం ఒక చారిత్రక ఘట్టం. బ్రిటిష్ అధికారు ల లాఠీ దెబ్బలకు, బుల్లెట్లకు బెదరకుండా వేలాది మంది కలకత్తా వీధుల్లో గీతాలపన చేశారు. వీధుల్లో గుమిగూడి వందేమాతరం గీతతం ఆలపించడం నాడు ఒక విప్లవాత్మక చర్య. బెంగాల్ ప్రజల స్ఫూర్తి క్రమంగా యావత్ దేశానికీ వ్యాపించింది.

నేడు ఎర్రకోటపై గీతాలపన

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ప్రత్యేకంగా వందేమాతర గీతాలపన ఉంటుంది. ఎర్రకోటలో జరిగే అధికారిక వేడుకల్లో మొట్టమొదటిసారిగా వందేమాతరం గీతాలపన జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. దీనిలో భాగంగానే ఇప్పటికీ గాయకుల ఎంపిక, వాద్యబృందాల ఎంపిక కూడా పూర్తయింది. ఈ అరుదైన ఘట్టం వందేమాతర గీతానికి లభించిన అరుదైన గౌరవం.