థియేటర్లు దద్దరిల్లే మాస్ సాంగ్ రావులమ్మ!
హీరో సందీప్ కిషన్ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో రీతూవర్మ హీరోయిన్. రావు రమేశ్‌తోపాటు ‘మన్మధుడు’ ఫేమ్ అన్షు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా. ఈ నేపథ్యంలో మేకర్స్ క్రియేటివ్ ప్రమోషన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా సోమవారం ఈ సినిమాలోని రావులమ్మ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని పరిగి పరిసరాల్లో జరిగింది. ఈ షూటింగ్ తీరుతెన్నుల్ని లైవ్‌లో చూపించటం ద్వారా సినీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించారు మేకర్స్.
ఇలా పాట చిత్రీకరణను లైవ్‌లో ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘మేము క్రియేటివ్‌గా ప్రమోషన్స్ చేయాలని భావించాం. ఇది ఫస్ట్ ఎవర్ లైవ్ షూట్ ప్రెస్‌మీట్ అని చెబుతుంటే నాకు చాలా సర్‌ప్రైజ్‌గా అనిపించింది. చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇది.
నెల రోజులుగా డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాం. ఫెబ్రవరి 26న పెద్ద హిట్ కొడుతున్నామనే నమ్మకం ఉంది’ అన్నారు. హీరోయిన్ రీతూవర్మ మాట్లాడుతూ.. “సందీప్ లవ్లీ కో స్టార్. ప్రేక్షకులు ‘మజాకా’ సాంగ్స్‌ను థియేటర్లలో చాలా ఎంజాయ్ చేస్తారు” అన్నారు. దర్శకుడు త్రినాథరావు మాట్లాడుతూ.. ‘దాదాపు 70 మంది డ్యాన్సర్లతో భారీ సెట్స్‌లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ షూట్ చేశాం.
కంప్లీట్ అవుట్ డోర్‌లో చేస్తున్న ఈ రావులమ్మ ఇంకో మాస్ సాంగ్. ఫుల్ ఫోక్ సాంగ్. థియేటర్లలో దద్దరిల్లిపోతుంది’ అని చెప్పారు. ‘ఈసారి మళ్లీ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం’ అని నిర్మాత అనిల్ సుంకర అన్నారు. ‘మా బ్యానర్‌లో బెస్ట్ సినిమా తీశామని నమ్ముతున్నా’ అని నిర్మాత రాజేశ్ దండా చెప్పారు. “సినీప్రియులు ఈ మహాశివరాత్రిని మా ‘మజాకా’తో సెలబ్రేట్ చేసుకుంటారు” అని రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ అన్నారు.






