20 April, 2026 | 1:42 AM

మహాద్భుతంగా మేడారం గద్దెల ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలి

20-04-2026 12:00 AM

రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మేడారం, (మహబూబాబాద్) ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ఆదివారం ములుగు జిల్లాలోని  ఇంచర్ల గ్రామ శివారులోని ఎం ఆర్ ఫంక్షన్ హాల్  లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా  జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అరైవ్ అలైవ్‘ రోడ్డు భద్రత అవగాహన  కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి  దనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు.

మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ అభివృద్ధి చివరి దశ పనుల్లో వేగం పెంచి, వనదేవతల గద్దెల ప్రాంగణాన్ని భక్తుల కోసం మహాద్భుతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు.

ఆదివారం ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వాపురం ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణలతో కలిసి దర్శించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మేడారం చేరుకొని, సమ్మక్కసారలమ్మ వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం మేడారం హరిత హోటల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారే ఆదినారాయణ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. చివరి దశలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని గూర్చి మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో, గుత్తేదారులతో చివరి దశ అభివృద్ధి పనులపై పలు అంశాలను చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆలయ ప్రాంగణంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం మంజూరైన అన్ని ప్రధాన ఆర్చీల పనులను వేగంగా పూర్తి చేయాలని, సారలమ్మ పూజారుల కోరిక మేరకు క్యూలైన్ పక్కనే ప్రత్యేకంగా సారలమ్మ ప్రధాన ఆర్చీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి అందించాలని పేర్కొన్నారు. గుడికి సంబంధించిన రాతి నిర్మాణాలలో ఎక్కడా చిన్న ఖాళీలు కూడా లేకుండా అత్యంత పటిష్టంగా ఉండేలా చూడాలని, గద్దెల ప్రాంగణంలో ఎత్తు పల్లాలు లేకుండా ఫ్లోరింగ్ సరిచేయాలని, గద్దెల రైలింగ్, ఆలయ డ్రైనేజీలలో ఎక్కడ చుక్క నీరు నిలవకుండా చూడాలని, ఆలయ ప్రాంగణంలోని డ్రైనేజీ వ్యవస్థను ప్రధాన రహదారి డ్రైనేజీకి లింక్ చేసే పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.

ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రధాన రహదారికి ఇరువైపులా శుభ్రం చేస్తూ మొక్కలను నాటాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వనదేవతల ప్రాంగణంలో భక్తులకు మెరుగైన సేవలందించేందుకు, నిర్వహణ కోసం మొత్తం అవసరమైన సిబ్బంది ప్రతిపాదనలను సిద్ధం చేయాలని తెలిపారు. అభివృద్ధి పనులలో ఫేజ్ 2లో భాగంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టవలసిన అభివృద్ధి పనుల కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి మల్లూరు దేవాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులలో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేసి, వచ్చే భక్తులకు అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు లోటుపాట్లు కలగకుండా ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించే విధంగా ఆలయ ప్రాంగణం ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్థానిక పూజారి కుటుంబానికి చెందిన బాలుడికి దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం చాలా బాధాకరమని మంత్రి పేర్కొన్నారు.

ఈ సంఘటనపై వెంటనే స్థానిక మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని బాలుడికి మెరుగైన వైద్యం అందించడం జరిగిందని, దానికి సంబంధించిన ప్రతి రూపాయి ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించిందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బాలుడికి, బాలుడి కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని, కాలుకు సంబంధించి మెరుగైన టెక్నాలజీ ద్వారా కృత్రిమ కాలును  ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారని తెలిపారు. 

నార్లపూర్ గ్రామంలో.. 

ఆవుల లక్ష్మి రాజు దంపతులకు చెందిన ఇందిరమ్మ గృహాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.,తో కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఏఎస్పీ మనన్ భట్, డిఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జీ,  గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఏ పి ఓ వసంతరావు, ఆర్డీఓ వెంకటేష్, మేడారం సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.