మార్కెట్ నిండా మక్కలే!
పెరిగిన విస్తీర్ణం.. తగ్గిన ధర
అన్నదాతకు దక్కని ‘మార్క్ ఫెడ్’ మద్దతు
కేసముద్రం, మార్చి 10 (విజయక్రాంతి): యాసంగి సీజన్ లో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర లభించడం లేదు. యాసంగి సీజన్ లో సాగుచేసిన మొక్కజొన్న పంట కోతలు జిల్లా వ్యాప్తంగా మొదలయ్యాయి. యాసంగిలో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా లక్షా 3 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసినట్లు చెబుతున్నప్పటికీ ఆ లెక్కకు మించి పంట సాగు విస్తీర్ణం అయినట్లు రైతులు చెబుతున్నారు. ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు మొక్కజొన్నలు దిగుబడి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పంటలు కోతకు వస్తుండడంతో రైతులు మక్కలను మార్కెట్లకు విక్రయానికి తెస్తున్నారు.
మంగళవారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు 4 వేల బస్తాల మక్కలు విక్రయానికి వచ్చాయి. అయితే కొంత తేమ ఉందనే సాకుతో వ్యాపారులు ధర తగ్గించడంతో రైతులు కొందరు తక్కువ ధరకు విక్రయించలేక, తేమ అధికంగా ఉన్న మక్కలను యార్డులో ఆరబెట్టుకున్నారు. దీనితో యార్డు పూర్తిగా మక్కలతో నిండి పసుపు వర్ణంగా మారింది. వానాకాలంలో సాగుచేసిన పత్తి, మిర్చి తో పాటు ఇతర పంటలు ప్రతికూల వాతావరణం కారణంగా ఆశించిన దిగుబడి రాకపోవడంతో పంట కాలానికి ముందే తొలగించి ఈసారి మొక్కజొన్న సాగు చేశారు.
దీనితో అక్టోబర్ లో సాగుచేసిన మొక్కజొన్న పంట ఉత్పత్తులు రైతు చేతికి అందుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు మక్కలకు క్వింటాల్ కు గరిష్టంగా 1,800 ధర పెడుతున్నారు. ప్రభుత్వం మక్కలకు 2,400 రూపాయల మద్దతు ధర నిర్ణయించగా, ప్రస్తుతం మక్కలు విక్రయిస్తున్న రైతులకు క్వింటాలకు 600 రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనితో ఎకరానికి 12 వేల నుంచి 16 వేల రూపాయల వరకు రైతులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లలో ప్రైవేటు ట్రేడర్లు మక్కలకు ఆశించిన ధర ఇవ్వడం లేదని రైతులు పేర్కొంటున్నారు.
దీనివల్ల అటు వర్షాకాలంలో సాగు చేసిన పంటలు ప్రతికూల వాతావరణంతో దెబ్బతినగా, కాస్తో.. కూస్తో మక్కల సాగుతో మేలు కలుగుతుందని భావిస్తే గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల రెక్కల కష్టంతోపాటు పెట్టుబడి కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. మార్కెట్లో పంటలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించని నేపథ్యంలో మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు చేపట్టాల్సిన అవసరం ఉందని రైతులు చెబుతున్నారు. మద్దతు ధర దక్కకపోవడంతో మొక్క జొన్న పంట సాగుచేసిన రైతులు నిరాశ చెందుతున్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం
బహిరంగ మార్కెట్లో మక్కలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించడం లేదని విషయాన్ని ప్రభు త్వం దృష్టికి తీసుకువెళ్లాం. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాం. ప్ర భుత్వం కూడా మక్కల కొనుగోళ్లకు చర్యలు చేపట్టే దిశగా ఉంది. యాసంగి సీజన్లో సాగుచేసిన మొక్కజొన్న పంట ఉత్పత్తులు ఇప్పుడిప్పుడే మార్కెట్ కు వ స్తున్నాయి. మార్చి చివరి వారం, లేదం టే ఏప్రిల్ మొదటి వారంలో మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా మక్కల కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వవచ్చు. ప్రభు త్వ అనుమతి వచ్చిన వెంటనే మక్కలు కొనుగోలు చేస్తాం.
శ్యామ్, మార్క్ ఫెడ్, జిల్లా మేనేజర్
మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు చేపట్టాలి
అష్ట కష్టాలు పడి పండించిన మొక్కజొన్నలకు ప్రైవేటు ట్రేడర్లు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. క్వింటాలుకు 1800 రూపాయలు మాత్రమే పెడుతుండడం తో తీవ్రంగా నష్టపోతున్నాం. యూరి యా కోసం తీవ్ర ఇబ్బందులు పడడం తో పాటు కోతుల నుండి పంట రక్షణ కోసం రెయిన్బవలు చేను దగ్గరే ఉండి తీరా మార్కెట్కు తెస్తే క్వింటాలకు కేవ లం 1,800 రూపాయలు ఇస్తుండడంతో లాభం అటునుంచి.. రెక్కల కష్టా నికి కూడా ప్రతిఫలం దక్కడం లేదు.
వెంటనే ప్రభు త్వ స్పందించి మార్క్ ఫెడ్ సంస్థను రం గంలోకి దించి క్వింటాలకు 2,400 రూ పాయల చొప్పున మొక్కలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. ఇప్పటికే ప్రైవేటు ట్రేడర్లకు మద్దతుకు తక్కువ ధరకు విక్రయించిన రైతులకు పరిహారం అందజేయాలి.
మాచర్ల సాంబయ్య, రైతు, గుంజేడు




