8 June, 2026 | 1:47 AM

ఎమ్మెల్యే అడగలే.. వరాలు ఇవ్వలే!

08-06-2026 12:29 AM
  1. సీఎం పర్యటనపై నిరాశలో జడ్చర్ల ప్రజలు
  2. నియోజకవర్గానికి కావలసినవి అడగలేదంటున్న జనం
  3. సీఎం వచ్చిండని సంబరపడిన జడ్చర్లకు దక్కని ప్రత్యేకత

మహబూబ్‌నగర్, జూన్ 7 (విజయ క్రాంతి): మా ఊరికి సీఎం వస్తున్నాడు అంటూ హంగామా చేసిన జడ్చర్ల ప్రజలకు నిరాశ మిగిలింది. సీఎం పర్యటనపై కొండంత ఆశలు పెట్టుకున్న జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. సహజంగానే ఏ నియోజకవర్గంలో అయినా ముఖ్యమంత్రి స్థాయిలో బహిరంగ సభ జరిగినప్పుడు నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన సమస్యలపై స్థానిక శాసనసభ్యులు విన్నవించడం తదుపరి ముఖ్యమంత్రి ప్రసంగంలో  వాటికి సంబంధించిన అంశాలపై  వివరించడం జరుగుతుంది.

కాగా జడ్చర్ల సభలో అందు కు కొంత భిన్నంగా జరిగినట్లు తెలుస్తున్నది. నియోజకవర్గం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి  సభలో మాట్లాడుతూ జడ్చర్లను రెవె న్యూ డివిజన్ చేయాలంటూ విన్నవించడం జరిగింది. అయితే సీఎం ప్రసంగంలో  ఈ విషయంపై స్పష్టత రాకపోవడం కొంత నిరాశ మిగిల్చింది. ఎమ్మెల్యే సార్ అడగలేదు... రేవంత్ సార్ ఏమి ఇవ్వలేదు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం గమనర్హం.

ఇవి జడ్చర్ల సమస్యలు..

జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు చేస్తారని.. సభ జరుగుతున్న సమయంలో టీవీలకు సభా ప్రాంగణానికి భారీ ఎత్తున ప్రజలు చేరుకొని శ్రద్ధగా సీఎం ప్రసంగాన్ని విన్నారు. ప్రసంగం చేయి సమయంలో అప్పుడు ఇప్పుడు ఏదో ఒకటి చెబుతారని ఆశించిన జనానికి కేవలం ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయడం తప్ప మరేమీ వరాలు ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురి అయినట్లు తెలుస్తుంది.

పట్టణంలో ప్రచారం జరగడం తో ఆశపడి ఎదురుచూసిన వారికి నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. కొత్త మండలాల ఏర్పాటు బైపాస్ రోడ్డు రెవెన్యూ డివిజన్, నూతన పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ ఇబ్బందులు, జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది  లాంటి తదితర సమస్యలపై  పరిష్కారం లభిస్తుందని  ప్రజలు ఎదురు చూశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సైతం నిధుల మంజూరు ఇక్కడి సమస్యలపై ప్రస్తావించకపోవడం తో  జడ్చర్ల నియోజకవర్గం ప్రత్యేక నిధులు అవసరమైన పనులు సంబంధించి ఏది ప్రక టించలేదని పలు చర్చించుకుంటున్నారు.

సభ ఆధ్యాంతం ప్రతిపక్షంపై విమర్శలే..

 ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల సందర్శనకు  వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా స్పష్టంగా నిధులకు సంబంధించి  కేటాయింపులు ప్రకటించకపోవడం గమనార్హం. ప్రధాన ప్రతిపక్షం అయినా బి ఆర్ ఎస్ పై విమర్శలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తిట్ల దండకం తప్ప  ప్రాజెక్టులకు కానీ, పారి బహిరంగ ఏర్పాటుచేసిన జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి కానీ నిధుల మంజూరు, కేటాయింపులపై ఎలాంటి స్పష్టత రాకపోవడం  తో ఇటు ప్రజలే కాదు అటు నాయకులు సైతం నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది.

మరుసటి రోజు విరుచుకుపడిన బీఆర్‌ఎస్

అధికారికంగా సభ పెట్టి ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం తప్ప ప్రజలకు ఇది చేస్తామని చెప్పకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సీ లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే లు జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీఎం జిల్లాకు వస్తే వరాలు ఇవ్వాలి తప్ప ఆరోపణలు చేసి వెళ్ళిపోతే ప్రజలకు ఎలాంటి ఉపయోగ ఉంటుందని ప్రశ్నల వర్షం కురిపించారు.

మేము చేసింది చెబుతాం మీరు చేసేది చేయండి కేవలం ఏదో ఒకటి మాట్లాడి ప్రజల మనసు గెలవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని భవిష్యత్తులో బీఆర్‌ఎస్ పూర్తిస్థాయిలో విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. దీంతో సీఎం సభ అద్భుతంగా నిర్వహించినప్పటికీ ప్రత్యేకమైన నిధులు అభివృద్ధి పనుల గురించి ప్రస్తావన లేకపోవడంతో జిల్లా ప్రజలతో పాటు జడ్చర్ల నియోజకవర్గం ప్రజల్లో కూడా కొంత అసంతృప్తి కనిపిస్తుందని తెలుస్తుంది.