మాజీ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి గుండెపోటు
- సీపీఆర్‌తో తప్పిన ప్రాణాపాయం
- పరామర్శించిన కేటీఆర్, హరీశ్‌రావు
- మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు
- ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన సర్కార్
వరంగల్ (మహబూబాబాద్), జులై 26 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఉదయం హనుమకొండలోని తన స్వగృహంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు హనుమకొండ నగరంలోని రోహిణి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ మమతారెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది సార్లు సీపీఆర్ ప్రాణాపాయం నుంచి కాపాడారు.
అనంతరం గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళంలో రక్తం గడ్డ కట్టడంతో బ్లాకులు ఏర్పడ్డాయని నిర్ధారించి అవి కరగడానికి ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత, యాంజియోగ్రామ్ చేశారు. దీంతో పల్స్ నార్మల్‌గా ఉండడంతో కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు హుటాహుటిన హనుమకొండకు వచ్చి సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
మధ్యాహ్నం తర్వాత కొంతమేర పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం కుదుటపడింది. మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. దీనికోసం హనుమకొండ నుంచి హైదరాబాద్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది. సుదర్శన్ రెడ్డికి వెంటిలేటర్ సహాయంతో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని మాజీ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. సుదర్శన్ రెడ్డికి గుండెపోటుకు గురయ్యారనే వార్త తెలుసుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్‌ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులు, నర్సంపేట నుంచి పెద్ద సంఖ్యలో పెద్ది అభిమానులు హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలివచ్చారు.
అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలి
బీఆర్‌ఎస్ కేటీఆర్‌కు కేసీఆర్ ఆదేశాలు
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): అనారోగ్యానికి గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్‌లో వెంటే ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో చికిత్సకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పార్టీ ముఖ్య నేతలను అప్రమత్తం చేశారు.
అస్వస్థతకు గురైన విషయం తెలిసి, ఆందోళన చెందిన కేసీఆర్ ఉదయం నుంచి పెద్ది ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేశారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, వినోద్‌కుమార్, జిల్లా నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అప్రమత్తం చేశారు. సుదర్శన్ రెడ్డికి మెరుగైన చికిత్స అందేలా తగిన ఏర్పాట్లు చేయాలని, చర్యలు తీసుకోవాలని సూచించారు.






