8 June, 2026 | 1:23 AM

హామీలు ఇచ్చాం.. లక్షలు ఖర్చు పెట్టాం

08-06-2026 12:00 AM
  1. ప్రజలకు జవాబు చెప్పలేక ముఖం చాటు వేస్తున్నాం
  2. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ల వింత పరిస్థితి 

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 7,(విజయక్రాంతి): ఎన్నికల సమయంలో లెక్కలేనన్ని హామీలు ఓటర్ల గుప్పించాం.... గెలుపు కోసం రూ లక్షలు హెచ్చించాం... నేడు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నాం అంటూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నది మన పార్టీనే, మంత్రిని  కలుస్తాం చిరకాల సమస్యలకు పరిష్కారం చూయిస్తాం అంటూ గొప్పలు చెప్పిన అధికార పార్టీ కార్పొరేటర్లు,..

అధికార పార్టీని నిలదీసి మెడలోంచి నిధులను వరదలు పారేలా చేసి వార్డులను సుందరంగా తీర్చిదిద్దుతామంటూ హామీలు ఇచ్చిన ప్రతిపక్ష కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యే మన పార్టీవాడు నన్ను కార్పొరేటర్ గా గెలిపిస్తే సమస్యల రహిత వార్డులుగా తీర్చిదిద్దుతామని సిపిఐ కార్పొరేటర్లు గొప్పగా హామీలు గుప్పించారు ,అందరూ సైతం  నేడు ప్రజల ముందుకి రావడానికి జంకుతున్నారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు మున్సిపల్ కార్పొరేషన్ లో ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితి నేడు నెలకొంది.

కనీసం వార్డులను శుభ్రం చేయటానికి చాలినంత సిబ్బంది కూడా లేకపోవడం, కార్పొరేటర్లు బ్రతిమలాడి ఇతర డివిజన్లో నుంచి సానిటరీ సిబ్బందిని రప్పించి నామమాత్రపు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికే అర్థమైందనుకుంటా. కనీసం కార్పోరేటర్ కు సైతం అధికారులు సమాధానం చెప్పడం లేదంటే వారి గెలుసి ఏమి ప్రయోజనం.

శనివారం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఏకంగా నల్ల కండువలు కప్పుకొని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశానికి వచ్చారంటే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ దుస్థితికి అద్దం పట్టిందని చెప్పవచ్చు.

99 రోజుల నిధులు విడుదలలో జాప్యం 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో ప్రజాపాలన... ప్రగతి ప్రణాళిక పేరుతో ఏప్రిల్ నెలలో ప్రతి కార్పొరేటర్ రూ 50 వేలకు మించి ఖర్చు చేశారు. ఖర్చు చేసిన పైకం కోసం కార్పొరేటర్లు అధికారులను అనేక పర్యాయాలు కలిసి విన్నవించిన ఫలితంగా కొత్తగూడెం కార్పొరేటర్లకు రూ27వేలు చెల్లించి చేతులు దులుపుకున్నారు, పాల్వంచ డివిజన్ కార్పొరేటర్లకు ఇప్పటివరకు పైసా నిధులు విడుదల చేయలేదనీ వారే బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు నెలలుగా పది పైసల పని చేయలేదు..

నూతన కార్యవర్గం ఏర్పడి నాలుగు నెలలైనా ఇప్పటివరకు తమ డివిజన్లో పైసా పనిచేసింది లేదు.  ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చాం, ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు, ఇచ్చిన హామీలకు నిధులు ఎలా సమకూర్చాలో తెలియడం లేదని నూతనంగా ఎన్నికైన కార్పోరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వ హయాములో మంజూరైన నిధులతో కొన్ని ప్రాంతాల్లో నామ మాత్రం పనులు జరిగిన, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు ప్రోటోకాల్ మినహా నిధుల మంజూరు విషయంలో ఒరిగిందేమీ లేదు. దీంతో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేస్తూ కాలం గడుపుతున్నారు. 

పాల్వంచ డివిజన్లో సమాధానం చెప్పే నాథుడే లేడు 

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల పాల్వంచ డివిజన్ కార్యాలయంలో, కార్యాలయానికి వచ్చిన ప్రజలకు సమాధానం చెప్పడానికి అధికారులే కరువయ్యారు. ఏ చాంబర్లో చూసిన ఖాళీ కుర్చీలే దర్శనం ఇవ్వడం, సమస్యల తెలిపేందుకు వచ్చిన ప్రజలు సమస్య చెప్పనేందుకు అధికారులు లేకపోవడంతో బిక్కు ముఖంతో సమాధానం దొరక్క వెను దిరుగుతున్న పరిస్థితి నిత్యం దర్శనమిస్తోంది. పేరుకు మున్సిపల్ కార్పొరేషన్ గా మార్పు చెందడం తప్ప నాలుగు నెలల కాలంలో జరిగిన అభివృద్ధి, పరిష్కారమైన సమస్యలు శూన్యం అని చెప్పక తప్పదు.