ఎమ్మెల్యే బెదిరింపు ధోరణి సరికాదు
- ఏ హాని జరిగినా ఎమ్మెల్యే కూనంనేనిదే బాధ్యత..
- దళితుల సమాధుల మీద సౌదాన్ని నిర్మించుకున్న కూనంనేని
- జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 16 ,(విజయక్రాంతి): కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి కోసం నిర్వహించిన డిపిఆర్ టెండర్లలో అవినీతి జరిగిందని సాక్షాదారులతో సహా నిరూపించినందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బెదిరింపులకు దిగుతున్నాడని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ఆరోపించారు. ఆదివారం చుంచుపల్లి మండల పరిధిలోని శ్రీరామ ఫంక్షన్ హాల్ నందు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
డిపిఆర్ టెండర్ లో జరుగుతున్న అవినీతిపై తాను ప్రశ్నించినందుకే డిపిఆర్ టెండర్లు రద్దు అయ్యాయని స్పష్టం చేశారు. టెండర్ రద్దు కావడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే తనపై వ్యక్తిగతంగా దూషణలకు దిగుతూ తన స్థాయిని దిగజార్చుకున్నారని ఆరోపించారు. ఇకనుంచి వెంటబడతామని, ఊరుకునేది లేదని పరోక్షంగా ఎమ్మెల్యే హత్యా రాజకీయాలను ప్రోత్సహించేలా అనుమానం కలుగుతోందని అన్నారు. ప్రజాక్షేత్రంలో అవినీతిపై ప్రశ్నిస్తే హత్యా రాజకీయాలు చేస్తామన్న విధంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడడం ఏ విధంగా సమంజసమో నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
కేవలం అవినీతి పై ప్రశ్నిస్తే దాడులు చేస్తామని బెదిరింపు ధోరణిలో మాట్లాడితే భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అవినీతిపై ప్రశ్నించే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుందని గుర్తు చేశారు.ఒకవేళ తనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా అందుకు పూర్తి బాధ్యత ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వహించాల్సి ఉంటుందని చెప్పారు. కొత్తగూడెం నియోజకవర్గం లో జరిగే ప్రతీ అవినీతిపై ప్రజాక్షేత్రంలో రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమాలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,భూక్యా శంకర్, సంపూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.






