అభినవ గోబెల్స్.. రేవంత్‌రెడ్డి
- కేసీఆర్ తరహాలోనే అబద్ధాలు, మోసాలతోనే పాలన
మహిళా బిల్లును అడ్డుకోవడంలో రేవంత్ కీలక పాత్ర
బిల్లును అడ్డుకుని దక్షిణాదికి తీరని ద్రోహం
కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ‘అబద్ధాలు, మోసాలనే నమ్ముకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినవ గోబెల్స్’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. అబద్ధాలు, మోసాలు చేసే వారినే ప్రజలు న మ్ముతారని బహిరంగంగా ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. ఆ అబద్ధాల పునాదులపైనే ఆ యన సీఎం అయ్యారని విమర్శించారు.
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామని, రాష్ట్రంలోని ప్రతి మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లిస్తామని, తులం బంగారం, స్కూటీ ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక తూట్లు పొడిచారని ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే దొంగ హామీలు, పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతూ పాలనను కొనసా గిస్తున్నారని దుయ్యబట్టారు.
నిజాయితీగా పనిచేసే నాయకులపై బురద చల్లడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లు ఆమోదం ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రతి రాష్ట్రానికి 50 శాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెంచి దక్షిణాదికి న్యాయం చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెడితే, ఇండీ కూటమి నేతలు బిల్లును అడ్డుకు న్నారని ధ్వజమెత్తారు.
ఈ విషయంలో లేనిపోని విష ప్రచారం చేసి మహిళా బిల్లును అడ్డుకోవడంలో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని, డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం జరగబోతోందని తప్పుడు ప్రచారాలకు తెరదీసి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగ కుండా కుట్రలు చేశారని ఆరోపించారు.
మూల్యం చెల్లించుకోక తప్పదు
జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నది వాస్తవమని, దీనిని దృష్టిలో ఉంచుకునే మోదీ ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచడం ద్వారా దక్షిణాదికి మేలు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెడితే, ఇండీ కూటమి పేరుతో అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బండి సంజయ్ హెచ్చరిం చారు.
ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా రేవంత్‌రెడ్డితోపాటు తమిళనాడు సీఎం స్టాలిన్ సహా ఇండీ కూటమి నేతలు దక్షిణాదికి ఉన్న అవకాశాలకు గండికొట్టారన్నారు. ముఖ్యంగా కుటిల రాజకీయాలతో మహిళల కలలను కల్లలు చేశారని, మహిళా బిల్లును అడ్డుకుని ఏదో సాధించామని సంబురాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ మహిళలతోపాటు దేశం లోని 70 కోట్ల మహిళలెవరూ ఇండీ కూటమి చేసిన అవమానాన్ని ఎన్నటికీ మర్చిపోరన్నారు.
అతి త్వరలోనే రేవంత్‌రెడ్డిసహా ఇండీ కూటమి నేతలు తగిన మూల్యం చెల్లించుకోవడం ఖాయమని, మహిళలంతా ఏకమై రేవంత్ సర్కార్‌ను గద్దె దించడం తథ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలను తెలంగాణలోని గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలోని పార్టీ నాయకత్వం సిద్ధమవుతోందని చెప్పారు.






