25 May, 2026 | 3:32 AM

చిరువ్యాపారుల పాలిట మున్సిపాలిటీ శాఖ జులుం..?

25-05-2026 01:55 AM

తైబజారును ఎత్తేసిన మున్సిపాలిటీ పాలకవర్గం  

రోడ్లపై విక్రయాలు చేయద్దుంటూ దబాయిస్తున్న మున్సిపాలిటీ శాఖ 

పాలకవర్గం నిర్ణయమా..? అధికారుల పెత్తనమా..?

ఉపాధి కోల్పోతామంటూ వణికిపోతున్న చిరు వ్యాపారుల కుటుంబాలు

వనపర్తి మున్సిపాలిటీలో జరుగుతున్న తాజా పరిణామాలు చిరు వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తైబజారును ఎత్తివేస్తూ పాలకవర్గం నిర్ణయం తీసుకోగా, మున్సిపాలిటీ అధికారులు రోడ్లపై వ్యాపారాలు చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది

వనపర్తి, మే 24 (విజయక్రాంతి): ఒకవైపు ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతున్న పేద ప్రజలు& మరోవైపు రోజువారీ వ్యాపారాలతో కుటుంబాలను పోషించుకుంటున్న చిరు వ్యాపారులపై మున్సిపాలిటీ శాఖ ఉక్కుపాదం మోపుతుండటంపై  వనపర్తి పట్టణంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

సంవత్సరాలుగా కొనసాగుతున్న తైబజారు వ్యవస్థను ఒక్కసారిగా ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయం  ఒకవైపు చిరు వ్యాపారులకు ఊరట నిస్తున్నప్పటికి రోడ్ల పైన విక్రయాలు జరుపరాదంటూ మున్సిపాలిటీ శాఖ అధికారులు వ్యవహారిస్తున్న తీరు చిరు వ్యాపారుల పాలిట గుది బండగా మారుతుంది. తై బజారు ఎత్తివేస్తూ ప్రకటనలు ఇచ్చి తిరిగి అధికారులే విక్రయాలు జరుపవద్దంటే మేము ఎట్లా బతకాలి అంటూ చిరు వ్యాపారులు అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

తై బజారు ఎత్తివేయడం వెనుక అసలు కారణాలు ఏమిటి..? 

గతంలో తైబజారు వేలం దక్కించుకున్న వ్యక్తి మున్సిపాలిటీకి చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించకపోయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. నోటీసులు ఇచ్చి, మళ్లీ వెనక్కి తీసుకుని, చివరకు కొంతకాలం మున్సిపాలిటీనే వసూళ్లు నిర్వహించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు కొత్త పాలకవర్గం ఏర్పడిన వెంటనే తైబజారును ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయం వెనుక అసలు కారణాలేమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

తై బజారు వద్దంటూ పాలక వర్గం తీర్మానం చేయడం అది గడిచిన వారం పది రోజుల్లో మున్సిపాలిటీ అధికారులు  రంగంలోకి దిగి రోడ్లపై వ్యాపారాలు చేయొద్దంటూ చిరు వ్యాపారులను హెచ్చరించడం మరింత వివాదానికి దారి తీయడమే కాకుండా ముందు రద్దు చేస్తాం తరువాత రోడ్ల పై విక్రయాలు జరుపకుండా చూసే బాధ్యత మున్సిపాలిటీ దే అన్నట్లుగా ఇటు పాలక వర్గం అటు మున్సిపాలిటీ శాఖ అధికారుల తీరు ఉందని చిరు వ్యాపారులు, పట్టణ ప్రజలు బహిరంగానే చర్చించుకుంటున్నారు. 

పాలకవర్గం నిర్ణయమా..? అధికారుల పెత్తనమా..?... 

పాలకవర్గం చెప్పిందా..? అధికారులు తమంతట తామే చేస్తున్నారా..? లేక మరెవరైనా ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా..? అన్న అనుమానాలు పట్టణ ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. వార్డు లో గాని పట్టణంలో గాని అటు పాలక వర్గం ఇటు ఆయా వార్డు కౌన్సిలర్లు ఒక్క మాట మౌకికంగా ఆదేశాలు ఇస్తేనే అక్కడి నుండి మున్సిపాలిటీ శాఖ అధికారులు వెళ్లిపోవడం, సమస్య ఉంటే ఆగమేఘాల మీద పని చేసే అధికారులు పాలక వర్గం మున్సిపాలిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయంకు విరుద్ధంగా పని చేస్తారా లేకపోతే వాళ్ల నిర్ణయంతో మాకేం పని మున్సిపాలిటీ కి ఆదాయం వచ్చే తై బజారు ను రద్దు చేసినప్పుడు చిరు వ్యాపారులు ఎలా రోడ్ల పైన విక్రయాలు చేస్తారు చూద్దామని లేకపోతే గత కొన్ని నెలలుగా జరుగుతున్న వసూళ్ల వ్యవహారంపై కూడా పట్టణంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

పేదవాడికి మాత్రం బతికే హక్కు లేదా..? 

రోజూ కూరగాయలు, పండ్లు, చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవించే పేద కుటుంబాలు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. పట్టణంలో పెద్ద వ్యాపారులకు అన్ని సౌకర్యాలు& పేదవాడికి మాత్రం బతికే హక్కు లేదా..? అంటూ చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. తైబజారు ఎత్తివేతతో చివరకు నష్టపోతున్నది మాత్రం రోజువారీ ఆదాయంపై బతికే పేద వ్యాపారులేనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, మున్సిపాలిటీ అధికారులు మాత్రం ట్రాఫిక్ సమస్యలు, రహదారుల ఆక్రమణల కారణంగానే చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నట్లు సమాచారం. అయితే ప్రత్యామ్నాయ స్థలం చూపకుండా వ్యాపారులను తరిమేయడం ఏ న్యాయమని ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు స్పందించి చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందా..? లేక వందల కుటుంబాలను రోడ్డున పడేస్తుందా..? అన్నది వేచి చూడాల్సి ఉంది.

రోడ్డును ఆక్రమించకుండా వ్యాపారాలు చేసుకోవాలి..

రోడ్డు ను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న క్రమంలో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ను ఆక్రమించుకోకుండా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకోవాలి. రోడ్డు ను ఆక్రమించి వ్యాపారాలు చేయవద్దని సూచించడం జరిగింది.

- వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ కమిషనర్, వనపర్తి