24 July, 2026 | 12:48 PM

లోద్ది జాతరకు అటవీ శాఖ బ్రేక్..!

24-07-2026 11:46 AM

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో జాతరకు అనుమతి నిరాకరణ

పులులు, వన్యప్రాణుల సంరక్షణ కోసమే సీజనల్ క్లోజర్

నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు

అచ్చంపేట, జూలై 24: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో ప్రతి ఏడాది నిర్వహించే లోద్ది జాతరకు ఈసారి అటవీ శాఖ అనుమతి నిరాకరించింది. వన్యప్రాణుల పరిరక్షణ, ముఖ్యంగా పులులు, ఇతర అడవి జంతువుల సంతానోత్పత్తి, పిల్లల సంరక్షణ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అమల్లో ఉన్న మూడు నెలల సీజనల్ క్లోజర్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా అటవీ అధికారి శ్రీ రేవంత్ చంద్ర (ఐఎఫ్‌ఎస్) శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

అటవీ శాఖ వివరాల ప్రకారం, లోద్ది జాతర జరిగే ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో ఉండటంతో ప్రతి సంవత్సరం అమలు చేసే కాలానుగుణ మూసివేత ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సమయంలో అడవిలో మానవ సంచారం తగ్గించడం ద్వారా పులులు, చిరుతలు, అడవి జంతువులు ప్రశాంత వాతావరణంలో సంచరించడంతో పాటు వాటి సంతానోత్పత్తి ప్రక్రియకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడడమే ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నిర్వహణ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

కోర్ ఏరియాలోకి అటవీ శాఖ అనుమతి లేకుండా ఎవరైనా ప్రవేశిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972తో పాటు ఇతర అటవీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందువల్ల లోద్ది జాతరకు వచ్చే భక్తులు, ప్రజలు ఈ ఆంక్షలను గౌరవించి కోర్ ఏరియాలోకి వెళ్లేందుకు ప్రయత్నించవద్దని, వన్యప్రాణుల సంరక్షణలో అటవీ శాఖకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని అమూల్యమైన జీవవైవిధ్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా అటవీ అధికారి పేర్కొన్నారు.